ద‌క్షిణాది యాసపై రష్మికకు ఒకే ఒక్క న‌టి మద్దతు.. ఇత‌రులు గ‌ళం విప్ప‌రా?

నటి మధు తన `ఐ యామ్ ఇన్ లవ్` అనే సోషల్ మీడియా వీడియో సిరీస్‌లో రష్మిక మాట్లాడిన వీడియోను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Update: 2026-10-26 17:39 GMT

దక్షిణాది భాషలతో పాటు హిందీ చిత్రసీమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక‌ రష్మిక మందన్న తరచూ తన యాస (ఆక్సెంట్) విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతుంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో `కాఫీ విత్ కరణ్`లో పాల్గొన్న రష్మిక తనపై వస్తున్న విమర్శలకు ఎంతో ధైర్యంగా, నవ్వుతూ సమాధానమిచ్చారు. తాను దక్షిణాదికి చెందినదానిని అని.. కాబట్టి తన మాటల్లో సౌత్ ఇండియన్ యాస ఉండటం ఎంతో సహజమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రష్మిక స్పందించిన తీరును సీనియర్ నటి మధు (మధుబాల) బహిరంగంగా ప్రశంసిస్తూ పూర్తి మద్దతు ప్రకటించారు.

నటి మధు తన `ఐ యామ్ ఇన్ లవ్` అనే సోషల్ మీడియా వీడియో సిరీస్‌లో రష్మిక మాట్లాడిన వీడియోను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రష్మిక తన ప్రాంతీయ గుర్తింపును దాచుకోకుండా.. విమర్శలను చాలా కూల్‌గా .. ఆత్మవిశ్వాసంతో స్వీకరించిన తీరు తనకు ఎంతగానో నచ్చిందని మధు చెప్పారు. రష్మిక `కాఫీ విత్ కరణ్` షోలో తన యాసపై వచ్చిన విమర్శలను స్వీకరించిన తీరును నేను చూశాను. ఆమె దానిపై నవ్వుతూ.. తాను సౌత్ ఇండియన్ అని.. అందుకే ఆ యాస ఉందంటూ చాలా కూల్‌గా అంగీకరించింది. ర‌ష్మిక‌ ధైర్యం, ఆత్మవిశ్వాసం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి`` అంటూ మధు కొనియాడారు.

ఈ సందర్భంగా నటి మధు తన సినీ జీవితంలో ఎదురైన పాత జ్ఞాపకాలను, ఆందోళనలను గుర్తుచేసుకున్నారు. ``చాలా సంవత్సరాల క్రితం నేను హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పుడు.. నేను సౌత్ ఇండియన్ అనే విషయం తెలిసి జడ్జ్ చేస్తారేమోనని తీవ్రంగా భయపడ్డాను. ఆ యాస బయటపడకూడదని టీచర్‌ను పెట్టుకుని మరీ హిందీ నేర్చుకున్నాను. ఎవరైనా నా మాటల్లో చిన్న యాసను గుర్తిస్తే చాలు కంగారుపడిపోయేదాన్ని. అయితే నేను ఒక సౌత్ ఇండియన్‌గా నా గుర్తింపును గర్వంగా ఒప్పుకోవడానికి నాకు దాదాపు 35 సంవత్సరాల సమయం పట్టింది. కానీ రష్మిక కెరీర్ ప్రారంభంలోనే తన గుర్తింపును ఎంతో గర్వంగా సొంతం చేసుకుంది`` అని మధు వివరించారు.

రష్మికను అభినందిస్తూ మధు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని కూడా పంచుకున్నారు. ``నేను ఒక సౌత్ ఇండియన్‌ను అని.. సౌత్ యాస కలిగి ఉన్నానని చెప్పడానికి నాకు 30 ఏళ్లు పట్టింది.. కానీ రష్మిక నువ్వు ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నావ్. నీలోని ఈ ఆత్మవిశ్వాసం నాకు బాగా నచ్చింది. నువ్వు ఎప్పుడూ ఇలాగే స్టార్‌గా వెలగాలి`` అని మధు ఆకాంక్షించారు. సౌత్ యాసను చూసి విమర్శించే వారికి రష్మిక ఇచ్చిన సమాధానం. దానికి నటి మధు అందించిన మద్దతు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా రష్మిక హిందీ ఉచ్చారణపై వస్తున్న విమర్శలను తప్పుబడుతూ ఇప్పటికే ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గట్టి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. తమిళం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష అని.. రష్మికను విమర్శించే వారు ముందు కొన్ని తమిళ డైలాగులు సరిగ్గా చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఇటువంటి నిరర్థక భాషాధిపత్య ధోరణి ఎంతమాత్రం తగదని ఆయన స్పష్టం చేశారు. ఇలా సీనియర్ నటులు- ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుండటంతో రష్మిక అభిమానులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మధుబాల చూపిన ఈ చొరవ అభినందనీయమైనా కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన ప్రశ్న నెటిజన్లు - సినీ విశ్లేషకుల నుంచి ఎదురవుతోంది. మిగతా దక్షిణాది కథానాయికలు, ప్రముఖులు ఇలాంటి విషయాలపై ఎందుకు మద్దతు గళం విప్పడం లేదు?

సొంత గుర్తింపు - బాషా వివక్షపై మౌనం తగునా?

సౌత్ ఇండియా నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన నటీనటులు అక్కడి భాషను, యాసను నేర్చుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. అయితే ప్రాంతీయ యాసను ఒక లోపంగా లేదా ఎగతాళి చేసే విషయంగా చూపించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. సమంత, నయనతార, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ , మృణాళ్ ఠాకూర్ వంటి ఎంతో మంది దక్షిణాదిలో స్టార్ హోదా అనుభవిస్తూ బాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇటువంటి భాషాపరమైన హేళనలు ఎదురైనప్పుడు ఒక్కరిగా కాకుండా అందరూ కలిసి గళమెత్తితే పరిశ్రమలో ప్రాంతీయ వివక్షకు చెక్ పడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Tags:    

Similar News