‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్లు.. ఎలా ఉండబోతున్నాయంటే..
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా వసూలు చేసుకోవచ్చు.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం మేకర్స్ చివరి దశ ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరగగా, లేటెస్ట్ గా ఏపీ ప్రభుత్వం నుంచి మరో కీలకమైన అనుమతి వచ్చింది. టికెట్ ధరల పెంపుతో పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీలో సినిమా రిలీజ్‌కు సంబంధించిన టికెట్ రేట్లపై క్లారిటీ వచ్చేసింది.
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా వసూలు చేసుకోవచ్చు. జీఎస్టీతో కలిపి మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.252కు, సింగిల్ స్క్రీన్ టికెట్ రూ.197.50కు చేరనుంది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు అమల్లో ఉంటాయి. అంటే సినిమా విడుదలైన తొలి పది రోజుల పాటు ఏపీలో ఇదే ధరలతో టికెట్లు అందుబాటులో ఉంటాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత ఎస్. రాధాకృష్ణ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ అనుమతి ఇచ్చింది. టికెట్ రేట్లతో పాటు రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం కూడా కల్పించింది. అయితే విడుదలకు ముందు స్పెషల్ ప్రీమియర్ షోలు నిర్వహించడం లేదు. అక్టోబర్ 30న రెగ్యులర్ షోలతోనే సినిమా ప్రారంభం కానుంది. తొలి రోజు నుంచి అందుబాటులో ఉండే షోల సంఖ్యకు అనుగుణంగా థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు.
ఇక తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ ప్రస్తుతం టికెట్ రేట్ల పెంపు లేకుండానే సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల్లో తేడా ఉండనుంది. ఏపీలో పది రోజుల పాటు ప్రత్యేక అనుమతి అమల్లో ఉండగా, తెలంగాణలో సాధారణ రేట్లతోనే బుకింగ్స్ కొనసాగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటున్నారు.
వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆదరణ ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే పంచ్ డైలాగ్స్ కు, కథలకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'ఆదర్శ కుటుంబం'పై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించగా, తమన్ సంగీతం అందించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కింది.
ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 'ఆదర్శ కుటుంబం'కు యూ/ఏ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్‌ను 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్ డ్రామా అంశాలు కూడా కథలో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్‌ను త్రివిక్రమ్ ఎలా చూపించారనే ఆసక్తి కూడా ఉంది. విడుదలకు మరో నాలుగు రోజులే ఉండటంతో ఇక అడ్వాన్స్ బుకింగ్స్, థియేటర్ల కేటాయింపుపై మేకర్స్ ఫోకస్ పెట్టనున్నారు.