ఫిలింనగర్ బాధలు తెలిసిన సుధీర్ బాబు!
ఆయనకేంటి? ఇలా చిటికేస్తే అవకాశం వచ్చి పడుతుందనుకుంటారంతా. కానీ ఇండ స్ట్రీలో ఆయన కష్టాలు ఎలా ఉన్నాయి? అన్నది తాజాగా సుధీర్ బాబు మాటల్లో బయట పడింది.;
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు..సూపర్ స్టార్ మహేష్ బావ అంటే సుధీర్ బాబుకు అవకాశాలు రాకుండా ఉంటాయా? ఆయన అడగాలే గానీ ఎవరైనా సినిమాలు నిర్మిస్తారు? పిలిచి మరీ అవకాశాలిస్తారు అనుకుంటాం? అలా ఇవ్వకపోతే మహేష్ తో ఒక్క రికమండీషన్ ఫోన్ కాల్ చేయిస్తే చాలు వచ్చి దర్శక, నిర్మాతలు సుధీర్ బాబు ముందు నుంచుంటారు. ఆయనకేంటి? ఇలా చిటికేస్తే అవకాశం వచ్చి పడుతుందనుకుంటారంతా. కానీ ఇండ స్ట్రీలో ఆయన కష్టాలు ఎలా ఉన్నాయి? అన్నది తాజాగా సుధీర్ బాబు మాటల్లో బయట పడింది.
తానెంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా అవకాశాల కోసం మాత్రం ఓ సాధారణ వ్యక్తిలాగే కష్టపడినట్లు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బావ గా ఉండటం అన్నది తాను అదృష్టంగా మాత్రమే భావిస్తాననన్నారు. ఈ బంధాలు అనేవి అతి పెద్ద బాధ్యతగా చెప్పుకొచ్చారు. సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టిన క్రమంలో ఎన్నో ఆఫీస్ లు తిరిగానన్నారు. చాలా మంది కాఫీ ఇచ్చి మాట్లాడి, అవకాశం లేదని చెప్పేవారన్నారు. `నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు. కానీ ఫిలింనగర్ బాధలు మాత్రం తెలుసున్నారు.
`బస్సుల్లో అవకాశాల కోసం తిరగక పోవొచ్చు. కానీ కారులో కూర్చుని బాధపడిన రోజులు ఎన్నో చూసాను. ఎంతో బాధపడ్డాను. ఇది సానుభూతి కోసం చెప్పడం లేదు. అలా చెప్పాలనుకుంటే మొదటి సినిమా సమయంలోనే చెప్పేవాడి`నన్నారు. ఒక్క ఛాన్స్ వస్తే చాలనుకున్న తాను ఇప్పటి వరకూ 20 సినిమాలు పూర్తి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. `వీటిలో హిట్లు..ప్లాప్ లు రెండూ ఉన్నాయి. వాటన్నింటికీ నేను బాధ్యుడిని. నా తొలి సినిమాలో వాయిస్ బాలేదన్నారు. అలా చెప్పడంతో ఇప్పటికీ రోజూ గంట పాటు వాయిస్ పై శిక్షణ తీసుకుంటున్నాను.
బాడీ చూపించి బిల్డప్ ఇస్తున్నారని కొందరన్నారు. దీంతో `సమ్మోహనం` కోసం సాప్ట్ గా మారాను. ఆ తర్వాత అర్బన్ కథలే చేస్తున్నాడన్నారు. దీంతో `శ్రీదేవి సోడా సెంటర్’తో మాస్ ప్రయత్నం చేశానన్నారు. నా కెరీర్ లో ఏ డైరెక్టర్ ని ఓ ఫైట్ పెట్టమని గానీ, నిర్మాతను రూపాయి ఎక్కువ పెట్టమని గానీ ఎప్పుడూ చెప్పలేదు. మహేష్ ని కూడా రికమండ్ చేయమని ఎప్పుడూ అడగలేదు. 20 సినిమాలు చేసానంటే కారణం కృష్ణగారు అల్లుడు..మహేష్ బావ కావడంతోనే` అని అన్నారు.