బాహుబలి తరహా సినిమాతో సుధీర్‌ బాబు..!

ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్‌ స్టఫ్‌ ను చూస్తే మంచి కంటెంట్ ఓరియంటెడ్‌ మూవీ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2025-11-06 08:30 GMT

సుధీర్‌ బాబు హీరోగా రూపొందిన 'జటాధర' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రేపు అంటే నవంబర్‌ 7న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సుధీర్‌ బాబు సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది, ఆయన గత చిత్రాలు సైతం ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. అయితే సుధీర్‌ బాబు తన ప్రతి సినిమాతోనూ నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడం తో పాటు, విభిన్నమైన కథలు చేస్తున్నాడు అంటూ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. అందుకే ఆయన కెరీర్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సుధీర్ బాబు తాజాగా చేసిన జటాధర సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్‌ స్టఫ్‌ ను చూస్తే మంచి కంటెంట్ ఓరియంటెడ్‌ మూవీ అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుధీర్ బాబు జటాధర సినిమా..

ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చిన విషయం తెల్సిందే. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా మంది బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌లో అడుగు పెట్టి మంచి పేరును సొంతం చేసుకున్నారు. కాస్త లేట్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్న సోనాక్షి సిన్హా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. సినిమా నేపథ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అంచనాలు పెరిగాయి.

జటాధర ప్రమోషనల్‌ మీడియా మీట్‌లో..

ఇటీవల ఒక మీడియా సమావేశంలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ... ఆత్మల అన్వేషణ, ఫ్యామిలీ ఎమోషన్స్‌, డెవోషనల్‌ ఎలిమెంట్స్ తో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాను ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌. ఆ సీన్స్‌లో పాత్రల మధ్య భావోద్వేగాలు, ఆ సమయంలో ఉండే కథ చాలా బాగుంటుంది. అందుకే నేను ఈ సినిమాను ఒప్పుకున్నాను అన్నాడు. డబ్బును భూమిలో దాచిపెట్టి, దానికి ఆత్మలతో, పిశాచిలతో రక్షణ ఏర్పాటు చేస్తారు అని చాలా కథలు విన్నాం. అలాంటి పాయింట్స్‌తో ఈ సినిమా సాగుతుంది అన్నాడు. సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. సుధీర్‌ బాబుకు బాలీవుడ్‌లో ఉన్న గుర్తింపు కారణంగా అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

బాహుబలి తరహా సినిమాలో సుధీర్‌ బాబు

బాలీవుడ్‌ లో సినిమాలు చేసిన తర్వాత వరుసగా అక్కడ నుంచి ఆఫర్లు వచ్చాయని, కానీ పూర్తిగా తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఆఫర్‌లను వెనక్కి పంపిచినట్లుగా సుధీర్‌ బాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తెలుగులోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు పేర్కొన్నాడు. జటాధర సినిమా తర్వాత రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాను. ఆయన చెప్పిన కథ చాలా యూనిక్‌గా అనిపించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌తో సినిమాను చేయబోతున్నామని అన్నాడు. అంతే కాకుండా ఆ సినిమా బాహుబలి తరహాలో ఉంటుందని కూడా సుధీర్‌ బాబు చాలా నమ్మకంగా వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ రవీంద్రన్‌ ప్రస్తుతం ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా తర్వాత సుధీర్‌ బాబు సినిమా ఉంటుంది. వచ్చే ఏడాదిలో వీరి కాంబో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజంగానే సుధీర్ బాబు అన్నట్లుగా బాహుబలి తరహా సినిమా అయితే కచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడం ఖాయం.

Tags:    

Similar News