మతి చెడే ఫీచర్లతో బెంజ్ ఎస్.క్లాస్ ఈ హీరో సొంతం
అత్యంత విలాసవంతమైన ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారును తాజాగా కొనుగోలు చేశారు.;
టాలీవుడ్ యువహీరో సుధీర్ బాబు తన గ్యారేజీలోకి సరికొత్త విలాసవంతమైన కారును ఆహ్వానించారు. అత్యంత విలాసవంతమైన ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కారును తాజాగా కొనుగోలు చేశారు. స్టైలిష్ లుక్ - అద్భుతమైన పనితీరు కలిగిన ఈ కారు ధర సుమారు 1.70 కోట్ల నుండి 2.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కొత్త కారుతో సుధీర్ బాబు దిగిన ఫోటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. `కలల్ని వెంబడించడం... స్టైల్‌గా దూసుకుపోవడం బావుంది`` అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టాలీవుడ్‌లో బెంజ్ కార్లకు మంచి క్రేజ్ ఉంది. సుధీర్ బాబు కంటే ముందే పలువురు స్టార్ హీరోలు మెర్సిడెస్ బెంజ్ శ్రేణిలోని వివిధ మోడళ్లను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని నాగచైతన్య వంటి వారు కూడా మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ పై తమ మక్కువను ప్రదర్శించారు. అలాగే ప్రభాస్, రవితేజ వంటి స్టార్లు కూడా విలాసవంతమైన మెర్సిడెస్ మోడళ్లను వాడుతున్నారు. కేవలం తెలుగులోనే కాదు, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపిస్తుంటారు.
ప్రస్తుతం సుధీర్ బాబు నటనా కెరీర్ పరంగా సరైన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ ట్యాలెంటెడ్ హీరో వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో `మా నాన్న సూపర్ హీరో` వంటి చిత్రం తర్వాత.. `జటాధర` అనే భారీ పాన్-ఇండియా సూపర్ నేచురల్ థ్రిల్లర్ లోను సుధీర్ నటించాడు. పద్మనాభస్వామి ఆలయ రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం క్యూరియాసిటీని పెంచింది. గత ఏడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజుకు చేరకపోయినా సుధీర్ బాబు నటన, మేకోవర్ కి మంచి పేరొచ్చింది.
అయితే సుధీర్ కెరీర్ ఊపందుకోవాలంటే.. అతడు సరైన బ్లాక్‌బస్టర్ ని కొట్టాల్సి ఉంటుంది. నటుడిగా నిరూపించుకుంటూనే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సుధీర్ బాబు రేసులోకి దూకుడుగా దూసుకెళ్లాలంటే కంటెంట్ పరంగా ప్రయోగాల కంటే ఇప్పుడు సరైన విజయంపై దృష్టి సారించాల్సి ఉంటుంది.
అతడు కొనుగోలు చేసిన కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు పరిశ్రమలో అతడి స్థిరత్వానికి సింబాలిక్. అయితే మునుముందు అతడు సక్సెస్ తో దీనిని మరింత సుస్థిరం చేయాల్స ఉంటుంది. మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కొత్త కార్ గ్యారేజీలోకి చేరిన తరుణంలో.. ఈ కొత్త ప్రయాణం సుధీర్ బాబుకు మరిన్ని విజయాలను అందించాలని కోరుకుందాం.