స్టార్ కిడ్స్ మునుపటి తరంలా శ్రమించలేరా?
ముఖ్యంగా నేటి జెన్ జెడ్ స్టార్లు మునుపటి తరం నటవారసుల మాదిరి హార్డ్ వర్క్ చేయలేకపోతున్నారు. సుశిక్షితులుగా రావడం లేదు.;
భారతదేశంలోని అన్ని సినీపరిశ్రమల్లో బంధు ప్రీతి గురించిన చర్చ సాగుతోంది. ఇన్ సైడర్- ఔట్ సైడర్ డిబేట్ ఎండ్ లెస్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవలి కాలంలో పెద్ద స్టార్ల పిల్లలు లెగసీని ముందుకు నడిపించడంలో తడబడుతున్నారు. ఆరంగేట్రంలోనే గాలి తీసేస్తున్నారు. మొదటి సినిమాతోనే గొప్ప ప్రదర్శనను ఎవరూ ఆశించరు కానీ, కనీసం డ్యాన్సులు, ఫైట్స్ కోసం హార్డ్ వర్క్ చేసే వారు కూడా కనిపించడం లేదు. ఆహార్యం పరంగాను ఏదైనా కొత్తదనం కోసం ప్రయత్నించే నటవారసులు లేనే లేరు.
శ్రీదేవి నటవారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఆరంగేట్ర చిత్రాల్లో వారి నటన అంతగా ప్రజలకు కనెక్టవ్వలేదు. ఇక సారా అలీఖాన్, అనన్య పాండే లాంటి నటవారసులు ఆకర్షణీయంగా కనిపించినా కానీ, ఎక్స్ ప్రెషన్స్ పరంగా వృద్ధి చెందడానికి చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఇటీవల తెరకు పరిచయమైన అమన్ దేవగన్, రాషా తడానీ, షానయా కపూర్ వంటి నటవారసులపైనా విమర్శలొచ్చాయి. రాషా తడానీ డ్యాన్సుల పరంగా కొంత మెరుగ్గా ప్రయత్నించినా కానీ, నటన అభినయం పరంగా తన తల్లి రవీనా టాండన్ ని సరిపోలలేదని అభిమానులు నిరాశ చెందారు. ఇకపోతే సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద స్టార్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ వెండితెర ఆరంగేట్రం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అతడు కనీస మాత్రంగా నటించేందుకు కానీ, డ్యాన్సుల కోసం కానీ ప్రయత్నించలేదని క్రిటిక్స్ విమర్శించారు.
ముఖ్యంగా నేటి జెన్ జెడ్ స్టార్లు మునుపటి తరం నటవారసుల మాదిరి హార్డ్ వర్క్ చేయలేకపోతున్నారు. సుశిక్షితులుగా రావడం లేదు. పైగా స్టేజీ డ్రామా లేదా బుల్లితెర షోలు, సీరియళ్లలో నటించిన అనుభవం కూడా వీరికి ఉండటం లేదు. దాని కారణంగా వీరంతా ప్లాస్టిక్ ఫేస్ లతో వికారమైన ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ పెద్ద తెర ఆరంగేట్రాన్ని నిరాశపరుస్తున్నారు. చిత్రపరిశ్రమను కొన్ని ఎంపిక చేసిన కుటుంబాలు ఏల్తున్నాయని, వారి నుంచి నటవారసుల ప్రవేశం ఇబ్బందికరంగా మారిందని కూడా విశ్లేషిస్తున్నారు. అలా కాకుండా పరిశ్రమ వెలుపలి నుంచి వచ్చి పెద్ద సక్సెసైన కార్తీక్ ఆర్యన్, విక్రాంత్ మాస్సే, ఆయుష్మాన్ ఖుర్రానా వంటి వారిని ఇప్పటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఔట్ సైడర్స్ గా వచ్చినా కానీ, వీరంతా రకరకాల వేదికలపై రాణించి, పెద్ద తెరకు రాక మునుపే చాలా శ్రమించారు. దీనికోసం ఏళ్ల తరబడి సమయం పట్టింది.
ఇకపోతే సైయారా చిత్రంతో నటీనటులుగా పరిచయమైన అందమైన జంట అహాన్ పాండే- అనీత్ పద్దా నటనకు ప్రజలు మంత్రముగ్ధం అయిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. అహాన్ పాండే నటవారసుడే అయినా కానీ తొలి ప్రయత్నమే మెప్పించాడు. తన పనిలో తాను డెడికేషన్ చూపించాడు. అనీత్ పద్దా అందచందాలతో పాటు, చక్కని నటన కనబరిచిందని ప్రశంసలు కురిసాయి. రెగ్యులర్ నటవారసులతో పోలిస్తే వీరంతా అద్భుతం అన్న ప్రశంసలు అందుకున్నారు.