డైరెక్టర్ల ఫ్లాప్ స్ట్రీక్ - చేజారిన అవకాశాలు!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. `స్కంద` వంటి ఫ్లాప్ తర్వాత ఆయనకు బాలయ్య రూపంలో ఒక అద్భుతమైన అవకాశం దక్కింది.;
జయాపజయాలు సహజమే. కానీ అది ఏ దర్శకుడికైనా వరుసగా రెండు..మూడు ప్లాప్ లు పడితే మాత్రం అసహజంగా మారుతుంది. హిట్స్ ప్లాప్స్ ఆధారంగా మార్కెట్ అప్ లో ఉందా? డౌన్ లో ఉందా? అన్నది తేలుతుంది. సక్సెస్ ల్లో ఉంటే అవకాశాలు రావడం పెద్ద విషయం కాదు. కానీ వరుస ఫెయిల్యూర్స్ లో ఉంటే మాత్రం ఛాన్సులు అంత సులభం కాదు. కానీ కొంత మంది గత విజయాల నేపథ్యంలో నమ్మి అవకాశాలు కల్పిస్తుంటారు. లేటెస్ట్ రిపోర్ట్ చూస్తే? గత ఏడాది కాలంగా జరిగిన పరిణామాలు చూస్తుంటే స్టార్ హీరోల ఇమేజ్ కూడా దర్శకుల ఫ్లాప్ స్ట్రీక్‌ను అడ్డుకోలేకపోతోందని స్పష్టమవుతోంది. ఈ ఘటన హీరోల అభిమానులను, ఇటు నిర్మాతలను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. `స్కంద` వంటి ఫ్లాప్ తర్వాత ఆయనకు బాలయ్య రూపంలో ఒక అద్భుతమైన అవకాశం దక్కింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రిలీజ్ అయిన `అఖండ` సంచలనం సృష్టించడంతో? `అఖండ 2`పై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథనం, మితిమీరిన హింస కారణంగా బాలయ్య జోరుకు ఈ సినిమా బ్రేక్ వేసింది. దీంతో బోయపాటికి స్ట్రాంగ్ కం-బ్యాక్ దక్కలేదు.
`ది రాజాసాబ్ ` రూపంలో ప్రభాస్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని దర్శకుడు మారుతి కూడా సరైన రీతిలో వాడుకో లేకపోయాడనే విమర్శలు వెల్లు వెత్తిన సంగతి తెలిసిందే . భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన `రాజా సాబ్` డిజాస్టర్ టాక్ తో తేలిపోయింది. ఒక పాన్ ఇండియా స్టార్‌ను హ్యాండిల్ చేయడంలో మారుతి తడబడ్డాడని, విజువల్స్ , క్యారెక్టరైజేషన్ విషయంలో నాణ్యత లోపించిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ప్రభాస్ క్రేజ్‌కు తగిన సినిమా కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
వరుస ఫ్లాపుల్లో ఉన్న కిషోర్ తిరుమలను నమ్మి రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అనే సినిమా చేశారు. కథలో కొత్తదనం ఉన్నప్పటికీ టేకింగ్ విషయంలో కిషోర్ పాత పద్ధతులనే అనుసరించడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. రవితేజ వంటి మాస్ హీరోకు ఉండాల్సిన కమర్షియల్ హంగులను అద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అలాగే హరీష్ శంకర్ కూడా `మిస్టర్ బచ్చన్` చేదు అనుభవం తర్వాత పవన్ కళ్యాణ్‌తో తెరకెక్కించిన `ఉస్తాద్ భగత్ సింగ్` తో నైనా బయట పడతాడు? అనుకుంటే అక్కడా తేడా కొట్టేసింది.
స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినప్పుడు దర్శకులు కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేయాలి. కానీ చాలా మంది దర్శకులు తమ పాత సక్సెస్ ఫార్ములాపైనే ఆధారపడుతూ హీరోల ఇమేజ్‌ను నమ్ముకుని కథనంపై పట్టు కోల్పోతున్నారు. దీనివల్ల వందల కోట్ల బడ్జెట్ వృథా ఖర్చుగా తేలుతుంది. అంతేకాదు హీరోల విలువైన సమయం కూడా వృథా అవుతోంది. స్టార్ హీరోల కాల్‌షీట్లు దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం దురదృష్టకరం.