మహేష్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతున్న రాజమౌళి
ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ కూడా అవలేదు.;
టాలీవుడ్ లో గత కొంతకాలంగా నటీనటుల పుట్టిన రోజు సందర్భంగా వారు నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వస్తున్నారనే సంగతి తెలిసిందే. తమ అభిమాన నటీనటుల బర్త్ డే సందర్భంగా వారు నటిస్తున్న కొత్త సినిమాల్లోని కంటెంట్ ను ఫస్ట్ లుక్ రూపంలోనో, లేదా టీజర్ రూపంలోనో అదీ లేదంటే టైటిల్ అనౌన్స్‌మెంట్ లాంటి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు దర్శకనిర్మాతలు.
అయితే ఇప్పుడు త్వరలోనే టాలీవుడ్ లో రానున్న స్టార్ బర్త్ డే ఎవరిదంటే సూపర్ స్టార్ మహేష్ బాబుదే. ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే. ఆగస్ట్ 9కి మహేష్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. అంటే ఈ బర్త్ డే మహేష్ ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్. అయితే ఆ స్పెషల్ డే ను మహేష్ తో సినిమా చేస్తున్న రాజమౌళి మరింత స్పెషల్ గా మారుస్తారని ఆయన అభిమానులంతా వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.
మహేష్ బాబు, రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ కూడా అవలేదు. భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి మహేష్ బర్త్ డే సందర్భంగా ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఆగస్ట్ 9న ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రావడం లేదని సన్నిహిత వర్గాలంటున్నాయి. సినిమాకు సంబంధించిన చాలా అంశాలు ఇంకా ఫైనల్ అవలేదని, అన్నీ సెట్ అయిన తర్వాతే సినిమాను అనౌన్స్ చేయాలని చూస్తున్నారని సమాచారం. మహేష్ బర్త్ డే సందర్భంగా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇది తీవ్ర నిరాశను మిగిల్చడం ఖాయం. గతేడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే అది జరగలేదు, కృష్ణ జయంతికి ఏదైనా రివీల్ చేస్తారనుకుంటే అప్పుడూ ఏమీ లేదు. కనీసం ఈసారైనా మహేష్ బర్త్ డే కు అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ ఆశలపై మరోసారి నీళ్లు చల్లేట్టే కనిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ29 టీమ్ ఆఫ్రికన్ అటవీ ప్రాంతాల్లో జరగనున్న తర్వాతి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది. ఈ షెడ్యూల్ లో చాలా అవుట్‌డోర్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.