SSMB29: రాజమౌళి ప్లాన్‌లో ఊహించని రన్ టైమ్

అంటే 3 గంటల 20 నిమిషాలు. దీనితో రాజమౌళి గత చిత్రం RRR రన్‌టైమ్‌ను (3 గంటల 2 నిమిషాలు) మించి పోతుందని తెలుస్తోంది.;

Update: 2025-06-26 19:13 GMT

ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే.. అది మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29 అని చెప్పొచ్చు. ఈ చిత్రం పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని, భారత సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని అభిమానులు, సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ రాకపోయినా, ఆసక్తికర వార్తలతో సోషల్ మీడియాలో హైప్ కొనసాగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే కాకుండా, ప్రస్తుతం దేశంలో వస్తున్న మిగతా బిగ్ బడ్జెట్ సినిమాలతో పోల్చితేనూ అత్యంత పొడవైన రన్‌టైమ్‌తో ఉండబోతోందట. అంటే, ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 200 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

అంటే 3 గంటల 20 నిమిషాలు. దీనితో రాజమౌళి గత చిత్రం RRR రన్‌టైమ్‌ను (3 గంటల 2 నిమిషాలు) మించి పోతుందని తెలుస్తోంది. ఒక్క భాగంగానే తెరకెక్కుతున్న ఈ సినిమా.. అంత భారీ ప్రయాణం చూపించబోతుందంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతున్నా.. జూలైలో కెన్యాలో మరో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్‌లో అడవుల్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే అక్కడి లొకేషన్లు ఫిక్స్ చేయగా, విదేశీ యాక్షన్ టీంను కూడా ఎంపిక చేశారు. ఇదంతా చూస్తే ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోందనే విషయం స్పష్టమవుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో రూ.50 కోట్ల ఖర్చుతో సెట్ చేస్తున్న కాశీ నగరం కూడా సినిమాకు విశేషంగా ఆసక్తి పెంచుతోంది.

ఇది కేవలం గ్రాఫిక్స్‌పై ఆధారపడే సినిమా కాదని, రియల్ లొకేషన్లు, ప్రాచీన సెట్స్, వాస్తవిక వాతావరణం అన్నింటినీ కలిపి చూపించే ప్రయత్నమనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తీసే ఒక్కో సినిమా టెక్నికల్ లెవెల్‌ను పెంచుతూ వస్తోంది. ఈసారి అయితే అది మరింత ముందుకెళ్తుందని చెప్పొచ్చు. మహేష్ బాబు తన కెరీర్‌లోనే ఇదంతా కొత్త అనుభవంగా భావిస్తున్నాడు. తన పూర్తి సమయాన్ని ఈ సినిమాకే కేటాయిస్తూ, ఇతర కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేశాడు.

ఇప్పుడు 200 నిమిషాల రన్‌టైమ్ అనే విషయంలోనే చూస్తే.. ఈ చిత్రం కేవలం రెగ్యులర్ సినిమాల బాటలో కాకుండా చాలా కొత్తగా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. భారత సినిమా మేకింగ్‌కు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 2026 విడుదల లక్ష్యంగా ఈ సినిమా పనులు కొనసాగుతుండగా, వచ్చే ఏడాది ఫస్ట్ గ్లింప్స్‌ రానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News