మీ పేరు పాడు చేయను బాబా.. నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ఎమోష‌న‌ల్!

తమ మొదటి సినిమా ఈవెంట్‌కు నోరు విప్పి అడగకుండానే ముఖ్య అతిథిగా విచ్చేసి సపోర్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (తారక్ అన్నా)కు కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2026-09-30 03:52 GMT

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర ముందు ఉంటే, తెర‌వెన‌క క‌థ అంతా న‌డిపించే ప్ర‌తిభావంతుడిగా ఎస్.ఎస్.కార్తికేయ పేరు ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో మార్మోగుతూనే ఉంది. 24 శాఖ‌ల్ని డీల్ చేయ‌గ‌ల స‌మ‌ర్థుడిగా అత‌డికి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాత‌గా పరిచయమవుతున్న `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అత్యంత భావోద్వేగ వాతావరణంలో జరిగింది. నిర్మాతగా ఇది తన మొదటి సినిమా అని పేర్కొంటూ.. ఈ చిత్రాన్ని కుటుంబమంతా కలిసి థియేట‌ర్ల‌లో ఎంజాయ్ చేసేలా తెరకెక్కించామని కార్తికేయ తెలిపారు. ఒక డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమాలా కాకుండా.. ప్రతి సీన్ చాలా కొత్తగా ఉండేలా దర్శకుడు శశాంక్ అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారని ఆయన ప్రశంసించారు.

నిర్మాత అంటే ఎలా ఉండాలనే విషయాలను ప్రముఖ నిర్మాత శోబు గారిని చూసి నేర్చుకున్నానని కార్తికేయ గుర్తుచేసుకున్నారు. అలాగే తన బ్యానర్ పేరు `షోయింగ్ బిజినెస్` అని కీరవాణి బాబాయ్ పెట్టారని.. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫాహద్ ఫాజిల్ సినిమాలంటే తనకు విపరీతమైన పిచ్చి అని.. ఆ ఆసక్తితోనే శశాంక్ చెప్పిన కథను ఆయనకు వినిపించగా ఈ ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చార‌ని .. అది త‌న‌కు చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. రాజమౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ``బాబా, మీ పేరును ఇంకా పైకి తీసుకెళ్లాలనేదే నా కోరిక``అంటూ ఎమోషనల్ అయ్యారు. పేరు చెడ‌గొట్ట‌న‌ని కూడా ప్రామిస్ చేసారు కార్తికేయ‌.

ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని దాదాపు 75 రియల్ లొకేషన్స్‌లో కష్టపడ్డామని చెప్పారు. సినిమా దర్శకుడు శశాంక్‌తో పాటు ప్రొడక్షన్ డిజైనర్లు మోహన్, ఆస్ట్రేలియా నుండి వచ్చి 8 నెలలు ఈ ప్రాజెక్ట్ కోసం పని చేసిన బ్రాడ్, రైటింగ్ సపోర్ట్ అందించిన శేఖర్, హంస .. ఇతర టెక్నికల్ టీమ్‌ సహకారం వెలకట్టలేనిదని కొనియాడారు.

తమ మొదటి సినిమా ఈవెంట్‌కు నోరు విప్పి అడగకుండానే ముఖ్య అతిథిగా విచ్చేసి సపోర్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ (తారక్ అన్నా)కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన వెంట నిలబడి డే అండ్ నైట్ కష్టపడ్డ ప్రొడక్షన్ టీమ్ (శశాంక్, రాహుల్, సతీష్, అభి తదితరులు), అసిస్టెంట్ డైరెక్టర్ల సేవలను, తన ప్రయాణంలో ఎప్పుడూ వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులను (అమ్మ తదితరులు) ఈ సందర్భంగా ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు.

ప్రేక్షకులు తమపై చూపించే ప్రేమను ఎప్పుడూ బాధ్యతగా భావిస్తానని కూడా ఈ వేదిక‌పై కార్తికేయ‌ తెలిపారు. ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలో చూసి ఆదరించాలని.. అందరికీ గర్వకారణంగా నిలిచేలా ఈ చిత్రాన్ని అందించామని చెబుతూ తన భావోద్వేగ ప్రసంగాన్ని ముగించారు. వేదిక‌పై కార్తికేయ‌ మాట్లాడుతున్న స‌మ‌యంలో అక్క‌డే ఉన్న అత‌డి మాతృమూర్తి ర‌మా రాజ‌మౌళి ఎంతో భావోద్వేగంతో కంట త‌డి పెట్టుకుని క‌నిపించారు. ప్ర‌స్తుతం కార్తికేయ ఎమోష‌న‌ల్ స్పీచ్ వీడియో క్లిప్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. డెబ్యూ నిర్మాతగా కార్తికేయ ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని నెటిజ‌నులు ఈ సంద‌ర్భంగా బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు.

Tags:    

Similar News