డైరెక్టర్ గా మారనున్న మరో రైటర్.. వాళ్లలానే సక్సెస్ అవుతాడా?
ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో ఇప్పుడు మరో రైటర్ డైరెక్టర్ గా మారడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.;
ఎప్పుడైనా సరే సినిమా బావుండాలంటే దానికి కథతో పాటూ రైటింగ్ కూడా బావుండాలి. అదంతా రచయిత చేతిలోనే ఉంటుంది. సినిమా ఎలా ఉన్నా కొన్ని సినిమాలు రైటింగ్ వల్ల మంచి పేరు తెచ్చుకోవడం, మరికొన్ని సార్లు రైటింగ్ వల్లే ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఒక సినిమా సక్సెస్ లో రచయితకు కూడా ఎక్కువ క్రెడిట్ ఇస్తూ ఉంటారు.
ఇప్పటికే డైరెక్టర్లుగా మారిన పలువురు రైటర్లు
అయితే రచయితగా కొంత ఎక్స్‌పీరియెన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే డైరెక్షన్ వైపు అడుగులేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పటికే అలా పలువురు రైటర్లు డైరెక్టర్లుగా మారి తమ అదృష్టాన్ని టెస్ట్ చేసుకుని స్టార్ డైరెక్టర్లుగా కూడా మారారు. త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి వారు తమ టాలెంట్ తో రైటర్ల నుంచి డైరెక్టర్లుగా మారి సక్సెస్ అవగా, మరికొందరికి మాత్రం రైటర్లుగా ఉన్నప్పుడు వచ్చే ఫేమ్, డైరెక్టర్లుగా మారాక రావడం లేదు. దానికి కారణం వారి డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవడమే.
సక్సెస్‌ఫుల్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్
ఇక అసలు విషయానికొస్తే టాలీవుడ్ లో ఇప్పుడు మరో రైటర్ డైరెక్టర్ గా మారడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ విస్సా ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారట. ఎంసీఏ, వెంకీ మామ, టైగర్ నాగేశ్వరరావు, 18 పేజెస్, రావణాసుర, డెవిల్, పుష్ప2 లాంటి సినిమాలకు వర్క్ చేసిన శ్రీకాంత్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నారని సమాచారం.
కళ్యాణ్ రామ్ తో శ్రీకాంత్ సినిమా
అందులో భాగంగానే నందమూరి కళ్యాణ్ రామ్ ను కలిసి శ్రీకాంత్ ఓ కథ చెప్పారని, కళ్యాణ్ రామ్ కూడా ఆ కథకు చాలా ఇంప్రెస్ అయ్యి, వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే ఛాన్సుందని అంటున్నారు. కళ్యాణ్ రామ్ తో కలిసి శ్రీకాంత్ ఆల్రెడీ డెవిల్, అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాలకు వర్క్ చేశారు. ఆ సినిమాల టైమ్ లో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడటంతో రీసెంట్ గా శ్రీకాంత్, కళ్యాణ్ రామ్ కు కథ చెప్పారని, అది నచ్చడంతో కళ్యాణ్ రామ్ కూడా ఓకే చెప్పారని అంటున్నారు. సక్సెస్‌ఫుల్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ మరి డైరెక్టర్ గా కూడా సక్సెస్‌ను అందుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో రైటర్ గా ఉన్న అనిల్ రావిపూడిని పటాస్ తో డైరెక్టర్ గా పరిచయం చేసి, అతన్ని స్టార్ డైరెక్టర్ గా మార్చిన కళ్యాణ్ రామ్, ఇప్పుడు శ్రీకాంత్ ను కూడా అలానే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా మారుస్తారేమో చూడాలి మరి.