శ్రీ‌లీల‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

సోష‌ల్ మీడియా యుగంలో నెటిజ‌నుల‌ అనైతిక ప్ర‌వ‌ర్త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అయిన‌దానికి కానిదానికి ట్రోలింగ్ చేయ‌డం రెగ్యుల‌ర్ వ్యాప‌కంగా మారింది;

Update: 2025-07-20 06:35 GMT

సోష‌ల్ మీడియా యుగంలో నెటిజ‌నుల‌ అనైతిక ప్ర‌వ‌ర్త‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అయిన‌దానికి కానిదానికి ట్రోలింగ్ చేయ‌డం రెగ్యుల‌ర్ వ్యాప‌కంగా మారింది. ఇక సెల‌బ్రిటీల‌కు ఇది తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారుతోంది. సోష‌ల్ మీడియాల్లో దిగ‌జారి కామెంట్లు చేసే అప‌రిప‌క్వ స‌మాజం, అందులో వ్య‌క్తుల గురించి ఏమ‌ని చెప్పాలి. విలువ‌ల‌కు తిలోద‌కాలిచ్చి తీవ్ర‌మైన ప‌ద‌జాలంలో దూషించే లేదా ద్వేషించే మ‌నుషులు సామాజిక మాధ్య‌మాల్లో ప‌రిచ‌య‌మవుతారు.

క‌థానాయిక‌లు లేదా న‌టీమ‌ణుల‌ను బూతు ప‌దాల‌తో తిట్టే అల‌వాటు, సామాజిక మాధ్య‌మాల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అనైతిక వ్య‌క్తుల‌ను నియంత్రించే వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం కూడా పెను స‌మ‌స్య‌. ఇటీవ‌లి కాలంలో అందాల క‌థానాయిక, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ‌లీల‌ను విమ‌ర్శించే లేదా తీవ్ర ప‌ద‌జాలంతో దూషించే, అస‌భ్య‌క‌రంగా తిట్టే ఒక వ‌ర్గం రెడీగా ఉంటోంది. స‌ద‌రు న‌టీమ‌ణి గురించి అగౌర‌వంగా, అవ‌మాన క‌రంగా మాట్లాడే వ్య‌క్తులు సోష‌ల్ మీడియాల్లో ఉన్నారు. వారు ఉప‌యోగించే భాష అత్యంత నీచ‌మైన‌ది.

`జూనియర్` సినిమాలోని కిరీటితో శ్రీ‌లీల `వైరల్ సాంగ్` నుండి స్క్రీన్‌షాట్‌లు, క్లిప్‌లను వైర‌ల్ చేస్తూ ప‌లువురు అస‌భ్య‌క‌ర కామెంట్ల‌ను పోస్ట్ చేస్తున్నారు. శ్రీ‌లీల‌ డబ్బు కోసం అందాల్ని ఆర‌బోసేందుకు సిద్ధంగా ఉంటుంద‌ని ఒక నెటిజ‌న్ కామెంట్ చేసాడు. చాలామంది అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాషను కూడా ఉపయోగించారు. నిజానికి ఐట‌మ్ పాట‌ల్లో చాలా మంది అగ్ర నాయిక‌లు అందాల్ని ఆర‌బోసారు. క‌త్రిన కైఫ్, స‌మంత‌, త‌మ‌న్నా, త్రిష లాంటి అగ్ర నాయిక‌లు అందాల ఆర‌బోత‌లో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. కానీ ఇప్పుడిలా శ్రీ‌లీల‌ను మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం త‌గునా? అని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. శ్రీ‌లీల ప్ర‌స్తుతం బాలీవుడ్ లో కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అట్లీ త‌దుప‌రి చిత్రంలో శ్రీ‌లీల న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇటు టాలీవుడ్ లోను ప‌లువురు ఫిలింమేక‌ర్స్ వినిపించిన క‌థ‌ల్ని ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.

Tags:    

Similar News