చెట్టు కింద చదువు నేర్పిన శ్రీ లీల!
శ్రీ లీల.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో సత్తా చాటుతూ దూసుకుపోతోంది.;
శ్రీ లీల.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. 'పెళ్లి సందD' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. రవితేజ హీరోగా నటించిన 'ధమాకా' సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ అందుకుంది.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. మధ్యలో భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలు చేసి.. మోస్తారుగా విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం తెలుగులో రవితేజతో మరొకసారి మాస్ జాతర అనే సినిమాలో చేస్తున్న ఈమె.. ఇటు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7న ఆమె సినిమా షూటింగ్లో కూడా భాగమయ్యారు. ఈ విషయాన్ని రాసి ఖన్నా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే మరోవైపు బాలీవుడ్ లో కార్తీక ఆర్యన్ తో ఒక సినిమా చేస్తున్న ఈమె.. అక్కడే మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలా తెలుగు, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమెకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీ లీల స్వతహాగా డాక్టర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు నటిస్తూ మరొకవైపు ఎంబిబిఎస్ కూడా పూర్తి చేసింది. అంతేకాదు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తన మంచి మనసు చాటుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమె టీచర్ కూడా అని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఇప్పుడు కాదు అని.. విద్యార్థి దశలో ఉన్నప్పుడే చిన్నపిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిందని సమాచారం.
ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.." నేను చిన్నప్పుడు బెంగళూరులో ఉండేదాన్ని. కానీ వేసవి సెలవులు వస్తే మాత్రం నా స్వస్థలమైన ఒంగోలుకు వెళ్లేదాన్ని. అక్కడ చిన్నప్పుడు మా తాత నాగేశ్వరరావు నిడమానూరి ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం ఇచ్చేవారు. అయితే పుస్తకంలో ఉన్న ఇంగ్లీష్ నేర్చుకొని చెట్టు కింద పిల్లల్ని పోగేసుకొని వాళ్లకు ఇంగ్లీష్ పాఠాలు చెబుతూ వారికి చదువు చెప్పాను. అలా నాకు చిన్నప్పుడే ఇంగ్లీష్ పై మంచి పట్టు ఏర్పడింది. ముఖ్యంగా ఈ పట్టు రావడానికి కారణం మా తాత ఇచ్చిన ప్రోత్సాహమే. అది ఎప్పటికీ మరువలేనిది" అంటూ శ్రీ లీల తెలిపింది
అలాగే తన గ్రాండ్ పేరెంట్స్ తో తనకు ఉన్న అనుభవాలను పంచుకుంటూ.." జీవితం చాలా చిన్నది. అందుకే ప్రతి ఒక్కరు గ్రాండ్ పేరెంట్స్ తోనే గడపాలి అప్పుడే జీవితంపై ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటికీ నాకు ఏదైనా సలహా కావాలి అంటే ముందుగా మా తాతయ్యను అడుగుతాను. మా అమ్మ తర్వాత నాకు తాతయ్య అంటే చాలా ఇష్టం. ఆయన సలహా లేకుండా ఏదీ కూడా ముందడుగు వేయలేను" అంటూ క్లారిటీ ఇచ్చింది శ్రీలీల. మొత్తానికైతే తన గ్రాండ్ పేరెంట్స్ తో తనకు ఉన్న అనుభవాలను తాజాగా అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.