ఫ్లాపుల్లో లీలమ్మ డబుల్ హ్యాట్రిక్
టాలెంట్, గ్లామర్, మంచి డ్యాన్సులు.. వీటన్నింటితో పాటూ చక్కగా మాతృభాషలో మాట్లాడే తెలుగమ్మాయి శ్రీలీల.;
టాలెంట్, గ్లామర్, మంచి డ్యాన్సులు.. వీటన్నింటితో పాటూ చక్కగా మాతృభాషలో మాట్లాడే తెలుగమ్మాయి శ్రీలీల. పెళ్లి సందడి2 తో టాలీవుడ్ లో కెరీర్ ను స్టార్ట్ చేసిన శ్రీలీల ఆ సినిమాలో తన యాక్టింగ్, డ్యాన్సులతో అందరినీ మెప్పించింది. తర్వాత రవితేజతో ధమాకా సినిమా చేసింది. ఆ సినిమా మంచి హిట్ గా నిలవడంతో శ్రీలీలకు ఆఫర్లు క్యూ కట్టాయి.
మాస్ జాతరపై భారీ ఆశలు
ఒకనొక టైమ్ లో శ్రీలీల నుంచి నెలకో సినిమా రిలీజైంది. అయితే లీలకు ఆఫర్లైతే వస్తున్నాయి కానీ అవేవీ తన కెరీర్ ను నెక్ట్స్ స్టేజ్ కు తీసుకెళ్లలేకపోతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతుంది. హిట్ కొట్టాలని ఎంతో ఆశగా ఉన్న అమ్మడి కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. శ్రీలీల నుంచి వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులవడంతో రవితేజతో చేసిన మాస్ జాతరపై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.
శ్రీలీల ఖాతాలో ఎక్కువ ఫ్లాపులే..
రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ అవడంతో మాస్ జాతర కూడా అదే స్థాయి సక్సెస్ ను అందుకుంటుందని భావిస్తే, అంచనాలను తలకిందులు చేస్తూ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఫలితంగా శ్రీలీల ఖాతాలో మరో ఫ్లాప్ నమోదైంది. అయితే శ్రీలీల ఫిల్మోగ్రఫీని చూసుకుంటే అమ్మడి ఖాతాలో ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయనేది స్పష్టమవుతుంది.
ధమాకా తర్వాత శ్రీలీల సోలో హీరోయిన్ గా వచ్చిన సినిమా ఏదీ సూపర్ హిట్ అయింది లేదు. పెళ్లి సందడి హిట్టవగా, ధమాకా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రామ్ పోతినేనితో చేసిన స్కంద ఫ్లాపుగా నిలిచింది. నందమూరి బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి హిట్టైనప్పటికీ ఆ సక్సెస్ బాలయ్య, అనిల్ ఖాతాలోకి వెళ్లింది తప్పించి శ్రీలీలకు దక్కలేదు. ఆదికేశవ, ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్లుగా నిలవగా మహేష్ తో చేసిన గుంటూరు కారం యావరేజ్ గా నిలిచింది. తర్వాత వచ్చిన రాబిన్‌హుడ్, మాస్ జాతర సినిమాలు కూడా ఫ్లాపులుగా నిలవడంతో శ్రీలీల ఎప్పుడు హిట్ అందుకుంటుందో అని తనతో పాటూ ఆమె ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రీలీల ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ ను అందుకోగా, పవన్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అయినా తనకు సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.