ఎన్టీఆర్ ని మెప్పించి...ఏఎన్నార్ కి ఒప్పించి !
ఆహా ఎంత వింత మోహం అంటూ 1966 డిసెంబర్ 16న ఒక లేత గొంతుక తెలుగు సినీ సంగీత ప్రపంచానికి పరిచయం అయింది.
ఆహా ఎంత వింత మోహం అంటూ 1966 డిసెంబర్ 16న ఒక లేత గొంతుక తెలుగు సినీ సంగీత ప్రపంచానికి పరిచయం అయింది. ఆ గొంతుక పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అప్పటికే తెలుగు సినీ సీమలో అద్భుతమైన గాన మాధుర్యంతో ఘంటసాల ఏలుతున్నారు. అంతే కాదు పీబీ శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు ఈ సమయంలో ఒక కొత్త గొంతు రావడం సాహసమే. ఘంటసాల తప్ప మరో గొంతు వినిపించని రోజులు అవి. ఆయన తమకు పాడితే సినీ జీవితం పండుతుందని పెద్ద హీరోల నుంచి వర్ధమాన హీరోలు అంతా కూడా ఎదురు చూసిన సందర్భం అది. ఎన్టీఆర్ కి పౌరాణికాల్లో ఏఎన్నార్ కి సాంఘీక చిత్రాలలో తన గొంతు అరువిచ్చి ఆ ఇద్దరే సొంతంగా పాడేరా అనిపించేలా సమ్మోహనం చేసిన ఘనత ఘంటసాల మాస్టార్ ది. అలాంటి తరుణంలో పీబీ శ్రీనివాస్ వంటి వారి చేత ఒకటీ అరా పాటలు ఆ ఇద్దరు అగ్ర హీరోలకు పాడించినా జనాలు అంగీకరించే వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలీ అంటే ఘంటసాల సరి సాటీ పోటీయే లేని వాతావరణంలో ఎస్పీ బాలు ప్రవేశించారు.
రెండేళ్ళలోనే ఆ ఎన్టీఆర్ కీ :
ఇక బాలు అదృష్టమేంటో కానీ సినీ సీమలో ప్రవేశించిన రెండేళ్ళ వ్యవధిలోనే ఎన్టీఆర్ కి పాడారు. ఏకవీర సినిమాలో తొలిసారిగా ఎన్టీఆర్ కి గొంతు అరువిచ్చారు. ఆ తరువాత ఎన్టీఆర్ సొంత సినిమా కోడలు దిద్దిన కాపురలో ఏకంగా డ్యూయెట్ పాడి ఫరవాలేదనిపించారు. అలా అడపా దడపా ఎన్టీఆర్ కి పాడుతూ 1974లో ఘంటసాల మరణించాక బాలూయే ఎన్టీఆర్ కి పూర్తి పాటలు పాడేలా కుదురుకుపోయారు. ఎదురులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ గొంతుని అనుకరిస్తూ పాడడంతో ఇక తిరుగులేని సింగర్ గా ఎన్టీఆర్ కి పాడేందుకు సెటిల్ అయిపోయారు.
అక్కినేనికి మాత్రం అలా :
అయితే అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రం బాలు పాడేందుకు చాలా ఏళ్ళు వేచి చూడాల్సి వచ్చింది. అందుకు కారణం ఆయన 1970లో వచ్చిన ఇద్దరు అమ్మాయిలు చిత్రంలో నా హృదయపు కోవెలలో అన్న సాంగ్ అక్కినేనికి పాడితే సూట్ కాలేదు. లేత గొంతుక అన్నారు. దాంతో అక్కినేని రామక్రిష్ణను ప్రోత్సహించారు. అచ్చం ఘంటసాలను ఇమిటేట్ చేస్తూ పాడే రామక్రిష్ణ గొంతుని జనాలు అభిమానులు అంతా ఓకే చేశారు. దీంతో బాలుకు అక్కినేనికి సెట్ కాదు అని సంగీత దర్శకులు కూడా భావించారు. అయితే పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా బాలు అక్కినేని విషయంలో ప్రయత్నించారు. ఆయన గొంతుకు దగ్గరగా తన స్వరాన్ని మ్యాచ్ చేస్తూ పాడడం ప్రాక్టీస్ చేసి అందులో సక్సెస్ అయ్యారు. అలా అక్కినేనికి పాడడం మొదలయ్యాక ఇక బాలూయే ది బెస్ట్ అన్నట్లుగా ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రేమాభిషేకం ఒక సెన్సేషన్ అని చెప్పాలి. అచ్చం అక్కినేని పాడారా అనిపించేలా బాలు పాడి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడంతో తన వంతు పాత్ర పోషించారు.
మూడు తరాల హీరోలకు :
ఇలా ఇద్దరు అగ్ర హీఅరోలకు మాత్రమే కాకుండా క్రిష్ణా శోభన్ బాబు కృష్ణంరాజు తరం హీరోలకూ బాలు అధ్బుతంగా పాడి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆ తరువాత తరం హీరోలు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ లకు కూడా పాటలు పాడి వారి సినిమాల సక్సెస్ లో భాగం అయ్యారు. ఇలా బాలు అంటే ఎవరికైనా సూట్ అయ్యేలా పాడతారు అని పేరు తెచ్చుకోవడమే కాదు ఏ హీరోకి తగినట్లుగా తన గొంతుకను సవరించి తెర మీద వారే పాడారు అన్న ఫీలింగ్ ఇస్తారన్నది జనాలూ నమ్మారు, దర్శక నిర్మాతలూ నమ్మారు. అందుకే హీరోలు అంతా బాలూయే కావాలన్నారు. అలా తన మొత్తం యాభై ఏళ్ళకు పైగా సాగిన కెరీర్ లో నలభై వేలకు పైగా పాటలు పాడి గాన గంధర్వుడుగా బాలు చరిత్రలో నిలిచిపోయారు. ఈ రోజు బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన పాటలు మాత్రం అలరిస్తూ అందులోనే ఆయన జీవించి ఉంటారని చెప్పడంలో అతి శయోక్తి లేదు.