8 వారాల ఓటీటీ విండో: సౌత్ ఇండస్ట్రీలో కొత్త నిబంధనలతో సవాళ్లు
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి పెరిగిన తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందని గుర్తించిన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలు ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి.;
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి పెరిగిన తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందని గుర్తించిన దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలు ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలో ప్రత్యక్షమవడం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని నిర్మాతలు గ్రహించారు. ఈ క్రమంలోనే దక్షిణాది పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి వచ్చి `సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్` (SIFPA) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ప్రధానంగా థియేట్రికల్ రన్‌ను కాపాడటం.. ఓటీటీ గడువును నియంత్రించడంపై దృష్టి సారించింది.
ముఖ్యంగా ఈ భేటీలో 8 వారాల ఓటీటీ విండో గడువుపై సుదీర్ఘంగా చర్చించారు. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం రెండు నెలల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదనే నిబంధనను తీసుకురావాలని నిర్మాతలు యోచిస్తున్నారు. పరస్పర సంప్రదింపులు లేకుండా ఓటీటీ సంస్థలు తీసుకునే నిర్ణయాలు వేలాది మంది సినీ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. ఈ కొత్త నిబంధనలను సమిష్టిగా అమలు చేయడానికి ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.
అయితే 8 వారాల గడువు నిబంధన వల్ల నిర్మాతలకు ఆర్థికంగా కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓటీటీ సంస్థలు ఒక సినిమాకు భారీ ధర చెల్లించడానికి ప్రధాన కారణం `వాల్యూ ఆఫ్ ఇమ్మీడియసీ`...అంటే సినిమా థియేటర్లలోకి వచ్చిన 3 లేదా 4 వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి వస్తే దానికి ఉండే క్రేజ్ వేరుగా ఉంటుంది. ఒకవేళ ఈ గడువును 8 వారాలకు పెంచితే అప్పటికే చాలా మంది ప్రేక్షకులు సినిమాను చూసేయడం లేదా పైరసీ బారిన పడటం వల్ల వ్యూవర్‌షిప్ తగ్గే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఓటీటీ సంస్థలు సినిమాలకు ఇచ్చే రేట్లు తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరో ప్రధాన అంశం ఏమిటంటే.. ఒక సినిమాపై సోషల్ మీడియాలో ఉండే ఆసక్తి కేవలం రెండు మూడు వారాలు మాత్రమే బలంగా ఉంటుంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ హైప్‌ను సబ్‌స్క్రిప్షన్లుగా మార్చుకోవాలని చూస్తాయి. గడువు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి క్షీణించి... కొత్త సబ్‌స్క్రైబర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనివల్ల ఓటీటీ ఒప్పందాల్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో కేవలం హిట్ సినిమాలకు మాత్రమే మంచి ధర లభించి, యావరేజ్ సినిమాలకు రేట్లు భారీగా పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇది చిన్న- మధ్య తరహా చిత్రాల నిర్మాతలపై అదనపు భారాన్ని మోపవచ్చు.
ఏది ఏమైనా ఈ 8 వారాల గడువు వల్ల థియేటర్ వ్యవస్థకు మేలు జరుగుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడితే వచ్చే రెవెన్యూ షేర్... ఓటీటీ ధరలో వచ్చే తగ్గింపును భర్తీ చేయగలదని వారి ఆశ. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఎలాగూ క్రేజ్ ఉంటుంది కాబట్టి... గడువు పెంచినా ఓటీటీ సంస్థలు వాటిని వదులుకోవడానికి ఇష్టపడవు. అంతిమంగా ఇది కంటెంట్ నాణ్యత .. థియేటర్లలో సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సినిమా మనుగడ కోసం థియేటర్.. ఓటీటీల మధ్య సరైన సమతుల్యత సాధించడం ఇప్పుడు అత్యవసరమని విశ్లేషిస్తున్నారు.