బాలీవుడ్ మోజులో కెరియర్ నాశనం చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్స్..!
ఒకప్పుడు టాలీవుడ్‌లో 'గోల్డెన్ లెగ్' అని పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, వరుస ఫ్లాపులతో ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది.;
టాలీవుడ్‌ను 'గ్లామర్ ఇండస్ట్రీ' అంటారు. ఇక్కడ ఒక్కసారి స్టార్‌డమ్ వస్తే కోట్లలో రెమ్యూనరేషన్, విపరీతమైన అభిమానం సొంతమవుతాయి. అయితే, మన సౌత్ హీరోయిన్లకు ఎప్పుడూ ఒక కోరిక ఉంటుంది.. అదే బాలీవుడ్ వెళ్లాలని! అక్కడ పాగా వేయాలనే మోజులో ఇక్కడ చేతిలో ఉన్న అద్భుతమైన అవకాశాలను వదులుకుని, చివరకు ఎటు కాకుండా పోయిన భామలు ఎందరో ఉన్నారు. పూజా హెగ్డే నుంచి మృణాల్ ఠాకూర్ వరకు.. ఇప్పుడు ఇదే బాటలో సాగుతూ తమ కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకుంటున్నారు.
పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్.. అదే తప్పు చేస్తున్నారా:
ఒకప్పుడు టాలీవుడ్‌లో 'గోల్డెన్ లెగ్' అని పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, వరుస ఫ్లాపులతో ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది. ప్రభాస్‌తో చేసిన 'రాధేశ్యామ్' ఫ్లాప్ తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో క్రేజ్ తగ్గింది. పోనీ ఇక్కడ నిలబడదామా అంటే.. మహేష్ బాబు 'గుంటూరు కారం' వంటి భారీ ప్రాజెక్టును వదులుకుని మరీ బాలీవుడ్ వైపు వెళ్లింది. ఇక మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే, సీతారామం, హాయ్ నాన్న వంటి హిట్స్‌తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ భామ, విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ అవ్వగానే ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. తరువాత అక్షయ్ కుమార్ పక్కన ఛాన్స్ దక్కిందన్న ఆశతో టాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది.
బాలీవుడ్ మోజులో శృతి హాసన్, ఇలియానా తిప్పలు:
శృతి హాసన్ కెరీర్ మొదటి నుండి బాలీవుడ్ చుట్టూనే తిరిగింది. సౌత్‌లో స్టార్ హీరోల ఆఫర్లు వచ్చినా కాదని, హిందీలో చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ సక్సెస్ లేకపోయేసరికి టాలీవుడ్ వైపు చూసింది. ఇక ఇక్కడ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చినా ఆమెకు బాలీవుడ్ మోజు తగ్గలేదు. ఫలితంగా ఇటు సౌత్‌లో స్టార్ హోదాను కోల్పోయి, అటు హిందీలో గుర్తింపు తెచ్చుకోలేక ఖాళీగా మిగిలిపోయింది. ఇక ఇదే బాటలో శ్రీలీల కూడ చేరనుంది. గతంలో ఇలియానా కూడా టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు బాలీవుడ్ డ్రీమ్స్ కోసం ఇక్కడి ఇండస్ట్రీకి సారీ చెప్పేసింది. తీరా అక్కడికి వెళ్ళాక ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు, ఇప్పుడు ఇక్కడ కూడా ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు.
దక్షిణాదిని కాదని వెళ్తే తిరుగుండదా:
గతం గమనిస్తే.. సౌత్ ఇండస్ట్రీని చిన్నచూపు చూసి బాలీవుడ్ వైపు వెళ్లిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు వెండితెరపై కనిపించడమే మానేశారు. బాలీవుడ్‌లో పోటీ ఎక్కువ, అక్కడ నెగ్గుకురావడం అంత సులభం కాదు. కానీ, అక్కడ ఉండే గ్లామర్, నేషనల్ లెవల్ గుర్తింపు కోసం మన భామలు ఇక్కడ తమకున్న పట్టును వదులుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పూజా, మృణాల్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే, వారు కూడా పాత హీరోయిన్ల బాటలోనే వెళ్తున్నారా? అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. హిందీ సినిమాలే చేస్తానంటూ మొండిగా ఉంటే, రేపు సౌత్‌లో మళ్ళీ పాగా వేయడం కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.