అన్ని స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేందుకు SIFPA .. ద‌క్షిణాది ఏక‌ తాటిపైకి!

భార‌తీయ సినిమా పాన్ వ‌ర‌ల్డ్ ని ఢీకొడుతోంది. వంద‌ల వేల కోట్ల బ‌డ్జెట్ల‌తో హాలీవుడ్ కి ధీటుగా నేడు సినిమాల‌ను నిర్మిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఇది అత్యంత కీల‌క స‌మావేశం.;

Update: 2026-05-10 11:26 GMT

భార‌తీయ సినిమా పాన్ వ‌ర‌ల్డ్ ని ఢీకొడుతోంది. వంద‌ల వేల కోట్ల బ‌డ్జెట్ల‌తో హాలీవుడ్ కి ధీటుగా నేడు సినిమాల‌ను నిర్మిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ఇది అత్యంత కీల‌క స‌మావేశం. దక్షిణ భారత సినీ పరిశ్రమలో పారదర్శకతను పెంపొందించడం.. సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడం లక్ష్యంగా `సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్` (SIFPA) తన రెండవ సమావేశాన్ని ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కీలక భేటీలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నిర్మాతల మండళ్లు, గిల్డ్స్ .. వాటి తాలూకా ప్రతినిధి సంస్థలు పాల్గొన్నాయి. దక్షిణాదిలోని నాలుగు భాషల పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచుతూ.. ఒక ఏకీకృత వేదికను బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు.



 


ఈ సమావేశంలో పరిశ్రమను వేధిస్తున్న పలు కీలక అంశాలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా నానాటికీ పెరిగిపోతున్న నిర్మాణ వ్యయాలను అదుపు చేయడం, థియేట్రికల్ ఎగ్జిబిషన్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. వీటితో పాటు ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు సవాలుగా మారిన ఓటీటీ విండో విధానం (సినిమా విడుదలైన ఎన్ని రోజులకు ఓటీటీలో రావాలనే నిబంధన), ఫిల్మ్ ఫైనాన్సింగ్ స్థిరత్వం... వర్క్‌ఫోర్స్ సమన్వయం వంటి విషయాలపై నిర్మాతలు తమ అభిప్రాయాలను ఈ వేదిక‌పై షేర్ చేసుకున్నారు.



 


దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక నిర్మాణాత్మకమైన.. పారదర్శకమైన వ్యవస్థను ఏర్పరచడమే SIFPA ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా అసోసియేషన్ పునరుద్ఘాటించింది. కేవలం నిర్మాతలు మాత్రమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. పలు సినిమాల‌ హక్కులను కొనుగోలు చేసే ఇతర భాగస్వామ్య వర్గాలతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని సభ్యులు గుర్తించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే సినీ రంగం ఆర్థికంగా స్థిరపడుతుందని సమావేశం అభిప్రాయపడింది.

పరిశ్రమలోని అన్ని విభాగాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని... దీని కోసం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించాలని ఈ భేటీలో నిర్ణయించారు. దక్షిణాది భాషా చిత్రాలు ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందుతున్న తరుణంలో.. నాలుగు పరిశ్రమల మధ్య ఇటువంటి సమన్వయపూర్వక విధానాలు అత్యవసరమని ప్రతినిధులు భావించారు. సమస్యలు ఎదురైనప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకుంటూ సమిష్టి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తీర్మానించారు.

హైదరాబాద్‌లో విజయవంతంగా ముగిసిన ఈ సమావేశం తర్వాత ఎస్.ఐ.ఎఫ్‌.పి.ఏ తన తదుపరి భేటీని 2026 జూన్ 14న కొచ్చిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కొచ్చి సమావేశంలో ఈరోజు చర్చించిన అంశాలపై మరిన్ని నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు.. పరిశ్రమ ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను ఖరారు చేయనున్నారు. దక్షిణాది నిర్మాతలంతా ఒకే తాటిపైకి రావడం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ద‌క్షిణాది అన్ని ప‌రిశ్ర‌మ‌లు ఒకే తాటిపైకి వ‌చ్చి క‌లిసి క‌ట్టుగా తీసుకునే నిర్ణ‌యాలు భ‌విష్య‌త్ సినిమాని దిశానిర్ధేశ‌నం చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా అదుపు త‌ప్పే బ‌డ్జెట్లు, ఓటీటీ నియ‌మాల‌ను స‌రైన పంథాలో ఖ‌రారు చేస్తే దాని ఫ‌లితం అద్భుతంగా ఉంటుంది.

Tags:    

Similar News