మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న స్టార్ హీరోయిన్ల కమ్‌బ్యాక్!
ఒకప్పుడు పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా పెళ్లి తర్వాత.. చిన్న విరామం తీసుకుంటేనో? మళ్లీ ఫామ్‌లోకి రావడం అంత సులువుగా జరిగేది కాదు.
ఒకప్పుడు పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా పెళ్లి తర్వాత.. చిన్న విరామం తీసుకుంటేనో? మళ్లీ ఫామ్‌లోకి రావడం అంత సులువుగా జరిగేది కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ సమీకరణాలు కూడా పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్, స్టార్ హీరోయిన్లు సరికొత్త ఉత్సాహంతో వైవిధ్యమైన పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద క్రేజ్ తగ్గలేదని నిరూపిస్తూ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు.`మహానటి`గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత అమ్మడు కాస్త బ్రేక్ తీసుకుంటుందేమో అనుకున్న వారందరికీ షాక్ ఇస్తూ టాలీవుడ్‌లో వరుస పెట్టి భారీ ఆఫర్లను దక్కించుకుంటోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కుతున్న `రౌడీ జనార్ధన` చిత్రంలో ప్రధాన కథానాయికగా నటిస్తోంది. అలాగే విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కలయికలో రానున్న ప్రతిష్టాత్మక చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ మార్కెట్‌ను సుస్థిరం చేసుకుంటోంది. ఇదే సినిమాతో యంగ్ బ్యూటీ కృతి శెట్టి సెకండ్ హీరోయిన్‌గా గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.
`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లోకి బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్‌లో లభించిన అవకాశం కృతి శెట్టి కెరీర్‌కు ఖచ్చితంగా బూస్ట్‌లా మారుతుందని నమ్మకంతో ఉంది. స్టార్ హీరోల చిత్రాల్లో భాగమవడం తో మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు గట్టి పునాది పడుతోంది. అలాగే టాలీవుడ్ టాప్ స్టార్స్ లలో ఒకరైన సమంత రూట్ మార్చి యాక్షన్ జోనర్ వైపు అడుగులు వేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటిస్తున్న `మా ఇంటి బంగారం` చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
జూన్ 19న విడుదల కానున్న సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో సామ్ సాధారణ గృహిణిగా కనిపిస్తూనే ఊహించని రేంజ్‌లో యాక్షన్ స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచనుంది. ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా సమంతను ట్రేడ్ పరంగా సరికొత్త ఎత్తులో నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా సైతం జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. మాస్ మహారాజా రవితేజ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `ఇరుముడి` చిత్రంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతోంది.
కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ బొమ్మగా కాకుండా కథను మలుపు తిప్పే బలమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ తమన్నా సీనియారిటీని చాటుకుంటోంది. రవితేజతో ఆమెకున్న ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ కానుంది. మొత్తానికి టాలీవుడ్ అగ్ర కథానాయికలు గ్యాప్ తీసుకున్నా? అంత కుమించిన బలమైన కథలతో కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. కమర్షియల్ ఫార్ములాకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెడ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్లలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.