కళాకారులు పూర్తి స్థాయిలో నిజాన్ని తెరపై ప్రదర్శించే స్థితి లేదా?
ప్రస్తుత కాలంలో కళాకారులకు పూర్తి స్థాయిలో సత్యాన్ని ఆవిష్కరించే స్వేచ్ఛ లేదని ప్రముఖ బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత కాలంలో కళాకారులకు పూర్తి స్థాయిలో సత్యాన్ని ఆవిష్కరించే స్వేచ్ఛ లేదని ప్రముఖ బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో వాస్తవాలను లేదా కఠినమైన నిజాలను ఎక్కువగా చూపిస్తే.. అవి వివాదాల్లో చిక్కుకుని రిలీజ్ లేకుండా నిలిచిపోయే ప్రమాదం ఉందని.. అందుకే నటీనటులు, దర్శకులు తాము ఎంచుకునే కథాంశాల విషయంలో ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇటీవల ఓటీటీలో సత్తా చాటుతున్న సోనాక్షి ఇంతకుముందు దక్షిణాదిన రజనీకాంత్ లింగా చిత్రంలో అనుష్కతో పాటు ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సోనాక్షి ఆ తర్వాత దక్షిణాదిన నటించలేదు.
తొలినాళ్లలో `దబాంగ్` వంటి కమర్షియల్ సినిమాలతో మెప్పించిన సోనాక్షి `లూటెరా`, `దహాద్` వంటి ప్రాజెక్టులతో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారని.. ఇది సృజనాత్మకతపై తీవ్ర ప్రభావం చూపుతోందని సోనాక్షి ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో ఉన్నంత ఎక్స్‌పోజర్ లేకపోవడం వల్ల కొంత స్వేచ్ఛ ఉండేదని.. కానీ నేటి డిజిటల్ యుగంలో ప్రతి అడుగు ఆచితూచి వేయక తప్పని పరిస్థితి నెలకొందని సోనాక్షి విశ్లేషించారు. సోనాక్షి వ్యాఖ్యలను బట్టి ఒక నిజకథను యథాతథంగా వెండితెరపై చూపిస్తామంటే సాధ్యపడదని అర్థం చేసుకోవాలి.
త్వరలో విడుదల కానున్న `సిస్టమ్` అనే లీగల్ డ్రామాలో సోనాక్షి మొదటిసారి న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు. అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేహా రాజ్‌వంశీ అనే శక్తివంతమైన పాత్రను పోషించారు. తన విలువలు, సూత్రాల కోసం పోరాడే ఒక వాస్తవికమైన లాయర్ కథగా ఇది సాగుతుంది. కోర్టు రూమ్ డ్రామాలు తనకు కొత్త అనుభూతిని ఇచ్చాయని.. ముఖ్యంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న అశుతోష్ గోవారికర్‌తో కలిసి పని చేయడం గొప్ప అనుభవమని సోనాక్షి తెలిపారు.
ఈ చిత్రంలో దక్షిణాది స్టార్ జ్యోతికతో కలిసి నటించడం గురించి సోనాక్షి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జ్యోతిక పనితీరు, క్రమశిక్షణ తనను ఎంతో ఆకట్టుకున్నాయని కొనియాడారు. ఇద్దరి పని తీరు ఒకేలా ఉండటం వల్ల సెట్స్‌లో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని.. జ్యోతిక వంటి ప్రతిభావంతురాలైన నటితో పని చేయడం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడానికి దోహదపడిందని సోనాక్షి సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ తనతో మరిన్ని ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అంతిమంగా.. తన కెరీర్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల విచారంగా ఉన్నా కానీ.. తాను చేసిన ఏ సినిమాను కూడా తక్కువ చేసి చూడనని సోనాక్షి స్పష్టం చేశారు. పొరపాట్లు చేయడం మనిషి సహజమని.. వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే ముఖ్యమని ఆమె నమ్ముతున్నారు. `సిస్టమ్` చిత్రం మే 22న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె తన హిట్ సిరీస్ `దహాద్ 2` షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.