డిసెంబర్ 3న ఫౌజీ దండయాత్ర! డబుల్ బ్యారెల్‌తో ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌లు, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఆయన సినిమాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ అవతారంలో కనిపిస్తూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
1940ల నాటి కాలాన్ని గుర్తు చేసే డబుల్ బ్యారెల్ గన్ చేతిలో పట్టుకుని, చుట్టూ శత్రువుల మృతదేహాల మధ్య కూర్చున్న ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. భారీ శరీరాకృతి, గంభీరమైన హావభావాలు, ఒంటరిగా భారీ సైన్యాన్ని ఎదుర్కొన్న యోధుడిలా కనిపిస్తున్న ప్రభాస్ గెటప్ పోస్టర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమా యాక్షన్ స్థాయి, విజువల్ గ్రాండియర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఈ ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ హింట్ ఇచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అయితే సినిమా అప్‌డేట్స్, రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ద్వారా మేకర్స్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
భారత స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి తన కెరీర్‌లోనే మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉన్న కథతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వి ఇస్మాయెల్ నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఎమోషన్స్ తో పాటు యాక్షన్‌ను సమపాళ్లలో మిళితం చేసే హను రాఘవపూడి శైలికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక రిలీజ్ డేట్ పరంగా కూడా ఫౌజీకి అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. డిసెంబర్ 3న సినిమా రిలీజ్ కావడంతో క్రిస్మస్ హాలిడే సీజన్ వరకు బాక్సాఫీస్ వద్ద మంచి రన్ దక్కే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజైన పలు సినిమాలు భారీ సక్సెస్‌లు సాధించిన నేపథ్యంలో, అదే సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా కలిసి వస్తుందనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. భారీ స్థాయి నిర్మాణ విలువలు, ప్రభాస్ స్టార్‌డమ్, హను రాఘవపూడి విజన్ కలిసి ఫౌజీని ఈ ఇయర్ మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియన్ మూవీస్‌లో ఒకటిగా నిలబెట్టాయి.