వారణాసికి కొత్త సవాల్ మొదలైందా?
ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం వెనుక నెలల తరబడి కొనసాగే స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటుంది.
ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ ను డిసైడ్ చేయడమంటే స్థానిక మార్కెట్, ఫెస్టివల్స్, స్టార్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకోవడమే సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజయ్యే భారీ బడ్జెట్ సినిమాలకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం వెనుక నెలల తరబడి కొనసాగే స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటుంది. ఏ దేశంలో ఎన్ని స్క్రీన్లు అందుబాటులో ఉంటాయి? ప్రీమియం ఫార్మాట్లలో ఎన్ని స్క్రీన్స్ దక్కుతాయి? అదే టైమ్ లో మరో భారీ సినిమా ఏదైనా వస్తుందా? వంటి ఎన్నో అంశాలు ఫైనల్ డెసిషన్ ను ప్రభావితం చేస్తుంటాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా IMAX స్క్రీన్ల సంఖ్య చాలా లిమిటెడ్‌గానే ఉండటం పెద్ద సవాల్‌గా మారింది. సాధారణ థియేటర్లతో పోలిస్తే ఐమాక్స్ స్క్రీన్లు చాలా తక్కువ. దీంతో ఒక పెద్ద హాలీవుడ్ సినిమా రిలీజైతే, ఆ స్క్రీన్లు కొన్ని వారాల పాటు అదే సినిమాకు కేటాయించే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో మరో భారీ సినిమా రిలీజ్ కు వస్తే స్క్రీన్ షేరింగ్, షో టైమింగ్స్ విషయంలో తీవ్ర పోటీ ఏర్పడుతుంది. అందుకే గ్లోబల్ ఈవెంట్ సినిమాలకు రిలీజ్ డేట్ ను ఫైనల్ చేయడం అత్యంత కీలకంగా మారింది.
ఇదే కారణంగా ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు కూడా అంతర్జాతీయ రిలీజ్ క్యాలెండర్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దేశీయ మార్కెట్ మాత్రమే కాకుండా నార్త్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి ప్రాంతాల్లో ఏ సినిమాలు రిలీజవుతున్నాయి? ఐమాక్స్ వంటి ప్రీమియం స్క్రీన్లపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది? అనే అంశాలను కూడా ముందుగానే అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధించాలంటే సరైన రిలీజ్ విండో దొరకడం కూడా కథ, స్టార్ పవర్‌లాగే కీలకమైంది.
ఈ విషయంలో డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గత నిర్ణయాలు పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయనెప్పుడూ ముందు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కు ఎమోషనల్ గా కట్టుబడి ఉండరు. బాహుబలి, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలు పలు కారణాల వల్ల వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ డెసిషన్స్ వెనుక మెయిన్ రీజన్ సినిమా క్వాలిటీని కాపాడటం, ప్రపంచవ్యాప్తంగా గరిష్ఠ స్థాయిలో రిలీజ్ కు అనుకూలమైన పరిస్థితులు సృష్టించడమే. నిర్మాతల దృష్టిలో చూస్తే రిలీజ్ డేట్ అంటే వందల కోట్ల పెట్టుబడికి సంబంధించిన బిజినెస్ డెసిషన్. డిస్ట్రిబ్యూటర్లకు అది స్క్రీన్ల లభ్యత, అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియం షోల నెంబర్‌తో ముడిపడి ఉంటుంది. ఆడియన్స్ యాంగిల్ లో మాత్రం అత్యుత్తమ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించడం చాలా ముఖ్యమవుతుంది. ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించడమే ఒక గ్లోబల్ రిలీజ్ ప్లానింగ్‌లో అతిపెద్ద సవాల్.
భారతీయ సినిమాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి మార్కెట్‌ను టార్గెట్ గా పెట్టుకుంటున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ అనేది కేవలం క్యాలెండర్‌లో ఒక రోజుగా కాకుండా దానికెంతో ప్రాముఖ్యత దక్కుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కానుందని జక్కన్న అనౌన్స్ చేసినా, మార్చి 26న జురాసిక్ పార్క్, ఏప్రిల్ 9న పానిక్ అనే హాలీవుడ్ సినిమాలు రిలీజవుతుండటంతో ఈ రెండు సినిమాల మధ్య వారణాసిని రాజమౌళి రిలీజ్ చేస్తారా లేక సినిమా బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని వాయిదా దిశగా అడుగులేస్తారా అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.