శోభిత బర్తడే స్పెషల్.. మిస్ ఇండియా నుండి అక్కినేని కోడలి వరకూ!

మోడల్ గా తన ప్రయాణంలో ఎన్నో దశలు చూసిన ఈమె.. తొలిసారి వెండితెరపై తన ఉనికిని చాటుకోవాలని అనుకుంది. అలా పేరుకే తెలుగమ్మాయినా తన ప్రయత్నాన్ని మాత్రం బాలీవుడ్ నుండి మొదలు పెట్టింది శోభిత.

Update: 2026-05-31 09:38 GMT

అక్కినేని పెద్ద కోడలిగా తనకంటూ ఒక హోదా నిలుపుకుంది శోభిత ధూళిపాళ్ల. 1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెనాలిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్ , విశాఖ వ్యాలీ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె పెద్ద చదువుల నిమిత్తం ముంబై యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. సాంప్రదాయ నృత్యాలు అయిన భరతనాట్యం , కూచిపూడిలలో శిక్షణ తీసుకున్న శోభిత.. ముంబైలో చదువుకుంటున్న సమయంలోనే అందాల పోటీలలో పాల్గొని తన గ్లామర్ తో జడ్జెస్ ను కట్టిపడేసింది. అలా 2013లో మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొని రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్న ఈమె.. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలలో ఏకంగా ఇండియా తరఫున పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్ నుండి ప్రయాణం..

మోడల్ గా తన ప్రయాణంలో ఎన్నో దశలు చూసిన ఈమె.. తొలిసారి వెండితెరపై తన ఉనికిని చాటుకోవాలని అనుకుంది. అలా పేరుకే తెలుగమ్మాయినా తన ప్రయత్నాన్ని మాత్రం బాలీవుడ్ నుండి మొదలు పెట్టింది శోభిత. ఇక 2016లో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవన్ 2.0 అనే చిత్రం ద్వారా స్మృతిక నాయుడు అనే పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది శోభిత.

2018లో తొలిసారి తెలుగులో..

ఇక 2017లో చెఫ్ , 2018 లో కాలకాండి అనే మరో రెండు హిందీ చిత్రాలలో మెరిసింది. అదే ఏడాది తొలిసారి గూఢచారి అనే చిత్రం ద్వారా సమీరారావు అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మన తెలుగమ్మాయి శోభిత ఈ సినిమా తర్వాత 2019లో మూతన్ అనే మలయాళ చిత్రం ద్వారా అక్కడ కూడా సందడి చేసింది.

ఇంగ్లీష్ సినిమాలతో కూడా గుర్తింపు..

2020లో ఘోస్ట్ స్టోరీస్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె.. 2022లో వచ్చిన మేజర్ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను పలకరించిన ఈమె.. మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ అమెరికన్ సినిమాలో కూడా నటించింది.

మోడల్ నుండి అక్కినేని కోడలిగా ప్రయాణం..

అలా పలు చిత్రాలలో నటిస్తుండగానే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అప్పటికే నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చి రెండేళ్లు అయింది . ఆ రెండేళ్ల తర్వాతే ఈమెతో మరింత పరిచయం పెంచుకొని.. 2024 ఆగస్టు 8న హైదరాబాదులో అక్కినేని నాగార్జున ఇంట్లో నిశ్చితార్థం చేసుకొని అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం చేసుకొని అక్కినేని ఇంటి కోడలిగా అవతరించింది శోభిత. అలా మోడల్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. అక్కినేని పెద్ద కోడలిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

పెళ్లి తర్వాత చీకటి వెబ్ సిరీస్..

ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న ఈమె.. చివరిగా చీకటి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇది అంతగా ఆకట్టుకోలేదు. కానీ ప్రస్తుతం వైవిద్య భరితమైన పాత్రలలో నటించడానికి సిద్ధమయ్యింది. మరొకవైపు అటు అంతర్జాతీయ వేదికలపై కూడా సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు..

ఇకపోతే ఈమె నటిగా మాత్రమే కాదు డబ్బింగ్ కూడా అందించింది. 2024లో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898AD సినిమాలో (దీపికా పదుకొనే)సుమతి పాత్రకు వాయిస్ ఓవర్ అందించింది. ఇలా తనలోని టాలెంటును నిరూపించుకుంటూ దూసుకు వెళ్తున్న శోభిత పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అటు అక్కినేని కుటుంబంతోపాటు అభిమానులు, సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News