ప్లానింగ్ లోపమా? పాన్ ఇండియా ట్రెండా?
నేడు ప్రతి సినిమాను కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఏంటంటే? టాప్ హీరోల చేతిలో భారీ ప్రాజెక్ట్‌లు ఉంటున్నా? అవి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏళ్లకేళ్లు సమయం పడుతోంది. ఒక సినిమా షూటింగ్ ప్రారంభమైతే థియేటర్‌లో రిలీజ్ కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతున్న సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్క సినిమాను పూర్తి చేయడానికి సమయం తీసుకుంటున్నారు. ఈ పరిణామం వెనుక అసలు కారణం ఏంటి? ఇది కేవలం ప్లానింగ్ లోపమా లేక మారుతున్న పాన్ ఇండియా ట్రెండ్ ప్రభావమా? అనేదానిపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
ఈ జాప్యానికి ప్రధాన కారణం పాన్ ఇండియా ట్రెండ్ అని కొందరు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు ప్రతి సినిమాను కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ , అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్సులు, వివిధ భాషలకు చెందిన భారీ తారాగణం భాగస్వామ్యం తో తెరకెక్కుతున్నాయి. ఈ భారీ హంగులను సమన్వయం చేయడంలోనే దర్శక, నిర్మాతలు చాలా సమయాన్ని కోల్పోతున్నారు.
సాంకేతిక నిపుణుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి రావడం కూడా సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఈ వాదనను మరికొందరు కొట్టి పారేస్తున్నారు. ఇది పూర్తిగా హీరోల ప్లానింగ్ లోపమే అని విమర్శిస్తున్నారు. ఒకే సమయంలో వేర్వేరు ప్రాజెక్ట్‌లకు కమిట్ కావడం, కథపై పూర్తి స్పష్టత లేకుండా షూటింగ్‌లోకి వెళ్లి మధ్యలో మార్పులు చేయడం వంటి కారణాల వల్ల షూటింగ్స్ ఆలస్యం అవుతున్నాయి. హీరోల డేట్స్ సర్దుబాటు కాకపోవడం, దర్శకులు ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేయకుండానే సెట్స్‌పైకి వెళ్లడం వంటి లోపాలు ప్రాజెక్ట్‌లను మరింత వెనక్కి నెడుతున్నాయి. ప్లానింగ్ లోపం వల్ల బడ్జెట్ అనూహ్యంగా పెరిగిపోవడమే కాకుండా అభిమానుల ఎదురు చూపులు కూడా తారాస్థాయికి చేరుతున్నాయి.
కారణాలు ఏవైనా? స్టార్ హీరోల సినిమాలు ఏళ్ల తరబడి వాయిదా పడటం వల్ల బాక్సాఫీస్ సమీకరణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోవడం, అటుపై ఆ అంచనాలను అందుకోవడం చిత్ర యూనిట్‌కు కత్తి మీద సాములా మారుతోంది. ఒకవేళ సినిమా విడుదలైన తర్వాత చిన్న నెగెటివ్ టాక్ వచ్చినా? అన్ని సంవత్సరాల శ్రమ ..పెట్టిన పెట్టుబడులు బూడిదలో పన్నీరుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల వచ్చే రిస్క్‌లను నిర్మాతలు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొందరు యువ హీరోలు మాత్రం పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులను వంద శాతం పూర్తి చేసుకున్న తర్వాతే షూటింగ్ ప్రారంభించడం, అనుకున్న టైమ్‌లైన్‌లో సినిమాను ముగించడం వంటి పద్ధతులను పాటిస్తున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల విషయంలో ఇదే స్ట్రాటజీని అనుసరిస్తే అనవసరమైన ఆలస్యానికి గురికాకుండా బాక్సాఫీస్ వద్ద సందడి చేయోచ్చని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. పాన్ ఇండియా అనే హంగుల కోసం కాలయాపన చేయడం కంటే పక్కా ప్లానింగ్ ఉంటేనే ఇండస్ట్రీకి నిలకడైన విజయాలు దక్కుతాయి.
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల ఆలస్యం వెనుక పాన్ ఇండియా ట్రెండ్ తెచ్చిన భారీ బాధ్యతలు ఎంత నిజమో? మేకర్స్ వైపు ఉన్న ప్లానింగ్ లోపాలు కూడా అంతే నిజం. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించినప్పుడే నిర్మాతలు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. అభిమానులకు కూడా పండగ వాతావరణం నిరంతరం అందుతుంది. రాబోయే రోజుల్లో దర్శక, హీరోలు ఈ లోపాలను సరిదిద్దుకుని మరింత వేగంగా అడుగులు వేస్తారని ఆశిద్దాం.