రూపాయి తీసుకోకుండా సినిమా చేస్తానన్న శోభన్ బాబు
టాలీవుడ్ కి అందగాడుగా సోగ్గాడుగా శోభన్ బాబుకు పేరు. ఆయనది మూడున్నర దశాబ్దాల సినీ జీవితం.;
టాలీవుడ్ కి అందగాడుగా సోగ్గాడుగా శోభన్ బాబుకు పేరు. ఆయనది మూడున్నర దశాబ్దాల సినీ జీవితం. దాదాపుగా 250 దాకా సినిమాలలో నటించారు 1970 నుంచి 80 దశకం మధ్య దాకా ఆయన తనదైన శైలిలో టాలీవుడ్ ని ఏలారు. ఇక శోభన్ బాబుకు మహిళా అభిమానులు ఎంతమంది ఉంటారో లెక్క లేదు. ఆయనకు హీమాన్ అని బిరుదు కూడా ఉంది. టాలీవుడ్ టాప్ సూపర్ సీనియర్ లిస్ట్ లో ఎన్టీఆర్ అక్కినేని, క్రిష్ణ శోభన్ బాబులను చెబుతారు. ఎన్నో కష్టాలను దాటి శోభన్ బాబు ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అంతే కాదు సినీ రంగానికి రిటైర్మెంట్ ప్రకటించిన తొలి హీరో కూడా ఆయనే కావడం విశేషం.
మొదట నో చెప్పి :
ఇదిలా ఉంటే శోభన్ బాబు 1990 దశకం ఎంటర్ అవుతూనే మెల్లగా సినిమాలను తగ్గించుకుంటున్నారు. అప్పటికే చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ ల శకం నడుస్తోంది. హీరో పాత్రల కంటే తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటే వేస్తాను అని చెబుతూ చాలా కధలను ఆయన రిజెక్ట్ చేస్తున్న నేపథ్యం అది. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు పరుచూరి బ్రదర్స్ రచనా దర్శకత్వంలో సర్పయాగం మూవీని తీయాలని ఫిక్స్ అయ్యారు. అందులో హీరో పాత్రకు శోభన్ బాబుని అనుకున్నారు. అయితే ఈ కధ విన్న శోభన్ తాను డాక్టర్ పాత్రలో ఉంటూ హత్యలు చేయడమేంటి అని మొదట నో చెప్పారట. కానీ పరుచూరి బ్రదర్స్ ఆయన్ని కన్వీన్స్ చేయడంతో చివరికి ఓకే చెప్పారు.
రిలీజ్ అయి సక్సెస్ కొట్టింది :
ఈ మూవీ రిలీజ్ రోజు అయితే పరుచూరి సోదరులు చాలా టెన్షన్ పడ్డారట. ఎందుకంటే శోభన్ బాబు ఇమేజ్ వేరు. ఆయన ఇద్దరు హీరోయిన్ల మధ్య నలుగుతూ చేసే పాత్రలనే ఆడియన్స్ ఎక్కువగా రిసీవ్ చేసుకుని హిట్లు ఇచ్చేవారు. ఈ మూవీలో శోభన్ పాత్ర హత్యలు చేస్తుంది. మరి ఎలా చూస్తారో అని డౌట్ లో ఉన్నారట. అయితే ఫస్ట్ టాక్ నుంచే మూవీ సూపర్ హిట్ గా సాగిపోయింది. దాంతో ఈ మూవీ విజయవంతం అయిందని తెలుసుకున్న శోభన్ బాబు పరుచూరి బ్రదర్స్ ఇద్దరినీ అభినందించారుట. తనతో మంచి సినిమా చేయించారు అని వారిని తెగ పొగిడారట.
ఫ్రీగా చేసి పెడతా :
ఇలాంటిదే మంచి కధతో తన వద్దకు వస్తే ఫ్రీగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు మూవీ చేసి పెడతాను అని పరుచూరి బ్రదర్స్ కి అక్కడికక్కడే ఆఫర్ ఇచ్చేశారుట నటభూషణుడు శోభన్ బాబు. అయితే సర్పయాగం తరువాత మళ్లీ శోభన్ బాబు వరసగా సక్సెస్ రూట్ లోకి వచ్చేశారు. ఏమండి ఆవిడ వచ్చేసింది అన్న ఈవీసీ సినిమాతో పాటు మరికొన్ని మూవీస్ ని ఆయన చేస్తూ బిజీ అయ్యారు. ఇక పరుచూరి బ్రదర్స్ కూడా బిజీగా ఉంటూ డైరెక్షన్ ని పక్కన పెట్టారు. ఈలోగా శోభన్ బాబు 1996 జనవరి 14న తన 60 వ బర్త్ డే సందర్భంగా సినీ రంగానికి రిటైర్మెంట్ ప్రకటించేశారు. దాంతో సర్పయాగం లాంటి మరో మూవీ ఈ కాంబినేషన్ లో రావాల్సింది రాకుండా పోయింది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలను పరుచూరి గోపాలకృష్ణ సభా ముఖంగా అందరితో పంచుకుని శోభన్ తో హిట్ మూవీ తీశామని ఆనందం వ్యక్తం చేశారు.