ఛాన్స్ ఇస్తే హిట్ అవ్వలేదు.. ఇప్పుడేమో ఇలా..

సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం ఒక అదృష్టం అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నిజమైన టాలెంట్.;

Update: 2026-01-29 00:30 GMT

సినీ పరిశ్రమలో అవకాశాలు రావడం ఒక అదృష్టం అయితే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నిజమైన టాలెంట్. కానీ కొందరు దర్శకులు సరైన సమయంలో దొరికిన పెద్ద ఛాన్స్‌ ను సరిగ్గా వినియోగించుకోలేక కెరీర్‌ లో వెనుకబడిపోతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన కొన్ని సినిమాలు ఆ విషయానికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తున్నాయి.

కార్తీ తన కెరీర్‌ లో హిట్లతో పాటు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నారు. అయితే హీరోగా ఆయన ప్రతి ఫ్లాప్ తర్వాత మరింత స్ట్రాంగ్ గా తిరిగి రావడం ప్రత్యేకత. కానీ అదే సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ల పరిస్థితి మాత్రం భిన్నంగా మారింది. కొన్ని సినిమాల పరాజయాలు దర్శకుల కెరీర్‌ లనే ప్రభావితం చేశాయి.

కార్తీ నటించిన దేవ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ గా నిలిచింది. ఆ చిత్రంతో దర్శకుడు రజత్ రవిశంకర్‌ కు పెద్ద అవకాశాలు దక్కుతాయని అంతా భావించారు. కానీ సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయనకు మరో పెద్ద ప్రాజెక్ట్ దక్కలేదనే చెప్పాలి. అదే విధంగా కార్తీ హీరోగా వచ్చిన జపాన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ మూవీకి దర్శకత్వం వహించిన రాజు మురుగన్ గతంలో సామాజిక అంశాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ సినిమా ఫ్లాప్ తర్వాత ఆయనకు కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ఇక కార్తీ నటించిన అలెక్స్ పాండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ మూవీ డైరెక్టర్ సూరజ్ అప్పటి వరకు మాస్ చిత్రాలతో పేరు తెచ్చుకున్నా, ఆ ఫ్లాప్ తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా డౌన్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఆల్ ఇన్ ఆల్ అళగురాజా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ మూవీ సినిమా పరాజయంతో దర్శకుడు రాజేష్ కూడా కెరీర్ పరంగా వెనుకబడ్డారు.

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాజేష్.. ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కార్తీ సినిమాలు ఫ్లాప్ అయినా, హీరోగా ఆయన కెరీర్‌ పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిసారి కొత్త కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతున్నారు. కానీ దర్శకులు మాత్రం అదే అవకాశాన్ని మళ్లీ పొందలేక సైలెంట్ అయిపోతున్నారు.

ఇటీవల కార్తీ నటించిన వా వాతియార్ లేటెస్ట్ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ మూవీ ఫ్లాప్ తర్వాత ఆ చిత్ర దర్శకుడు నలన్‌ కుమార్‌ స్వామి భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పుడు కోలీవుడ్‌ లో నడుస్తోంది. మొత్తానికి సినీ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం జీవితాన్ని మార్చేస్తుందన్న మాట ఎంత నిజమో.. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే కెరీర్ ఎంత వేగంగా దిగజారుతుందన్నదానికి కార్తీ సినిమాల దర్శకులే ఎగ్జాంపుల్స్.

Tags:    

Similar News