రజనీకాంత్ ఆత్మకథను కుమార్తె సినిమాగా తీస్తుందా?
తన తండ్రి ఆత్మకథ గురించి సౌందర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
తన తండ్రి ఆత్మకథ గురించి సౌందర్య రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత విశేషాలను స్వయంగా పుస్తక రూపంలోకి తీసుకువస్తున్నామని, ఇది విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం అవుతుందని ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ పేర్కొన్నారు.
తన తండ్రి స్వయంగా ఈ ఆత్మకథను రాస్తున్నారని తెలిపారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన `కూలీ` షూటింగ్ సమయంలోనే రజనీకాంత్ ప్రతిరోజూ సుమారు రెండు గంటల పాటు తన ఆత్మకథను రాసేవారని సమాచారం. రజనీకాంత్ తన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ఇప్పటివరకు ఎవరికీ తెలియని విశేషాలను, 4తన 42వ ఏట జరిగిన కొన్ని కీలక సంఘటనలను ఈ పుస్తకంలో పొందుపరుస్తున్నట్లు డైరెక్టర్ లోకేష్ ఒక ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చారు. బెంగళూరులో బస్సు కండక్టర్‌గా ఉన్న శివాజీరావు గైక్వాడ్, భారతీయ సినిమా చరిత్రలోనే తిరుగులేని `తలైవా`గా ఎలా ఎదిగారు అనే ప్రయాణాన్ని ఇందులో వివరించనున్నారు.
నేడు (28 జనవరి 2026) జరిగిన ఒక కార్యక్రమంలో సౌందర్య ఈ విషయాలను తెలియజేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన తండ్రి ఆత్మకథ విడుదలైనప్పుడు అది ఒక `ప్రపంచ స్థాయి సంచలనం` అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక సినిమా నటుడి కథ మాత్రమే కాదని, ఒక సామాన్య వ్యక్తి అసాధారణ శిఖరాలను ఎలా అధిరోహించాడనే స్ఫూర్తిదాయక ప్రయాణమని సౌందర్య పేర్కొన్నారు. సౌందర్య తాను నిర్మిస్తున్న `విత్ లవ్` (నవతరం ప్రేమకథా చిత్రం) అనే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని ధృవీకరించారు.
ఆత్మకథ గురించి మరిన్ని విశేషాలు...
సాధారణంగా సెలబ్రిటీల కథలను ఇతరులు రాస్తారు. కానీ రజనీకాంత్ తన జీవిత విశేషాలను తనే స్వయంగా పెన్నుతో పేపర్ మీద రాస్తున్నట్లు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇదివరకే వెల్లడించారు. ఈ పుస్తకంలో తన 42వ ఏట జరిగిన కొన్ని కీలక సంఘటనలు, ఆధ్యాత్మిక ప్రయాణం, బస్సు కండక్టర్ నుండి సూపర్ స్టార్ వరకు సాగిన ప్రయాణంలోని ఎవరికీ తెలియని రహస్యాలను రజనీకాంత్ షేర్ చేస్తారు. అయితే రజనీకాంత్ ఆత్మకథను కుమార్తె సినిమాగా తీస్తుందా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అలాంటి ఉధాత్తమైన ప్రయత్నం చేస్తే అది మరో సంచలనం అవుతుందని కూడా అభిమానులు భావిస్తున్నారు.
రజనీకాంత్ 2026 లైనప్:
రజనీ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. ఇది జూలై 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. 37 ఏళ్ల క్రితం ఆగిపోయిన రజనీ హిందీ సినిమా `హమ్ మేన్ షాహెన్‌షా కౌన్`ను ఆధునిక టెక్నాలజీతో రీమాస్టర్ చేసి, 2026 ఏప్రిల్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇంతలోనే తలైవా 173 గురించి ఆసక్తికర అప్డేట్ అందింది. దీనిని సిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మిస్తారు.