పదవి పోయినా తగ్గని ఆత్మగౌరవం: స్మృతి ఇరానీ స్ఫూర్తి ప్రయాణం!

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె తీసుకున్న నిర్ణయం... చూపించిన నిరాడంబరత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Update: 2026-09-06 08:30 GMT

పదవులు, హోదాలు ఉన్నప్పుడు మనుషుల్లో ప్రాభవం సాధారణమే. కానీ అధికారం లేన‌ప్పుడు..ఓటమి ఎదురైనప్పుడు అంతే సహజంగా అహంకారం లేకుండా సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడం అంద‌రికీ సాధ్యం కాదు. ఎదిగినా ఒదిగి ఉండటం.. పరిస్థితులను బట్టి తమని తాము మలుచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణమని కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ నిరూపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆమె తీసుకున్న నిర్ణయం... చూపించిన నిరాడంబరత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

సుదీర్ఘ కాలం పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండి కీలకమైన కేంద్ర కేబినెట్ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన స్మృతి ఇరానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏమాత్రం కుంగిపోలేదు. తన రాజకీయ ప్రయాణంలో ఒక ఘట్టం ముగియగానే ఏమాత్రం సంకోచించకుండా పూర్వం పనిచేసిన వినోద రంగానికి మళ్లీ అడుగులు వేశారు. అవకాశాలు తమంతట తాముగా వస్తాయని ఎదురు చూడకుండా స్వయంగా తానే ఇండస్ట్రీ ప్రముఖులకు ఫోన్ చేసి అవకాశాలు అడగడం స్మృతి నిరాడంబరతకు పరాకాష్ట.

జియో-హాట్‌స్టార్ ... స్టార్ వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్‌కు నేరుగా ఫోన్ చేసి `నేను ప్రస్తుతం నిరుద్యోగిని. నాకు ఏదైనా పని ఇవ్వగలరా? అని స్మృతి అడిగిన తీరు ఓ సంచలనం. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో శక్తివంతమైన నాయకురాలిగా వెలిగిన మహిళ, ఏమాత్రం నామోషి లేకుండా నేను నిరుద్యోగిని అని ఓపెన్‌గా అంగీకరించి పని కోరడం అన్న‌ది ఆమెలోని పరిణతి చెందిన వ్య‌క్తిత్వాన్ని తెలియజేస్తోంది.

మాజీ కేంద్ర మంత్రి నుంచి అలాంటి కాల్ రావడంతో ఉదయ్ శంకర్ మొదట ఆశ్చ‌ర్య‌పొయినా? నటన పట్ల ఆమెకున్న అంకితభావాన్ని, ఆచరణాత్మక దృక్పథాన్ని గుర్తించారు. ఒక నటిగా రోజుకు 12 గంటల పాటు సెట్స్‌పై కష్టపడాల్సి ఉంటుందని.. సాధారణ ఉద్యోగిలా పనిచేయగలరా? అని ప్రశ్నించినప్పుడు `కష్టపడి పనిచేయడంలో ఎలాంటి తప్పు లేదు` అని స్మృతి బదులివ్వడం ఆమె నైతిక విలువలకు నిదర్శనం. పని చిన్నదా? పెద్దదా ?అని చూడకుండా కష్టపడే తత్వమే మనిషిని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని స్మృతి ఇరానీ రుజువు చేశారు.

ఈ నిరాడంబరమైన కృషి ఫలితంగానే `క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2` ద్వారా బుల్లితెరపై తులసి విరానీగా పునరా గమనం సాధ్యమైంది. దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ అదే ఐకానిక్ పాత్రలో కనిపించడం ప్రేక్షకాభిమానులను అలరిస్తోంది. సెట్స్‌లో ఎంతటి సాధారణ నటిగా స్మృతి కలిసిపోయారనేది తోటి కళాకారులు, యూనిట్ సభ్యులను సైతం ఆశ్చర్యపరిచింది. పదవి పోయినా? పేరు ప్రఖ్యాతులు తగ్గినా? నిజాయితీగా పని సంపాదించుకుని గౌరవంగా జీవించాలనే స్మృతి ఆలోచనా విధానం న‌వ‌తరానికి స్ఫూర్తిదాయకం.

విజయం సాధించినప్పుడు పొంగిపోకుండా? ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా? స్థితప్రజ్ఞతతో వ్యవహరించడమే అసలైన విజయం. `ఎదిగినా ఒదిగి ఉండటం` అనే నానుడికి స్మృతి ఇరానీ ప్రయాణం సజీవ సాక్ష్యం. పదవుల కంటే శ్రమ గొప్పదని, హోదాల కంటే స్వయంకృషి మిన్న అని నిరూపించిన ఇరానీ రీ-ఎంట్రీ సినీ.. రాజకీయ వర్గాల్లోనే కాదు సమాజంలోని ప్రతీ ఒక్కరికీ గొప్ప నిదర్శనంగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News