సుధా కొంగర ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్`. హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని జనవరి 9న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.;
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి మూవీ `జన నాయగన్`. హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని జనవరి 9న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే సెన్సార్ వివాదం తలెత్తడం, మేకర్స్ మద్రాస్ హైకోర్ట్‌ని ఆశ్రయించడం.. కోర్టు సినిమా రిలీజ్‌పై స్టే విధించడంతో సినిమా రిలీజ్ వాయిదాపడింది. 21న తిరిగి విచారణ ప్రారంభిస్తామని చెప్పడంతో `జన నాయగన్` రిలీజ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదిలా ఉంటే ఇదే తరహా పరిస్థితిని శివ కార్తికేయన్ నటించిన `పరాశక్తి` ఎదుర్కొంది.
`సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత కొన్ని రోజులుగా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తూ వచ్చింది. జనవరి 10న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే సీబీఎఫ్‌సీ బోర్డ్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. ఏకంగా 25 కట్స్ సూచించడంతో సినిమా ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదనే వాదనలు వినిపించాయి. సెన్సార్ వారు చెప్పిన కట్స్‌కు టీమ్ అంగీకరాం తెలిపినా సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి కాలయాపన చేస్తూ వచ్చింది.
అయితే ఫైనల్‌గా `పరాశక్తి`కి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ జారీ చేయడంతో సినిమా అనుకున్న సమయానికి జనవరి 10 శనివారం ప్రేక్షకుల ముదుకొచ్చింది. ఇంతకు ముందు సెన్సార్ కమిటీ సినిమాలోని కీలక సన్నివేశాలని కుదిస్తూ 25 కట్స్ విధించడంతో దీనిని వ్యతిరేకిస్తూ డైరెక్టర్ సుధా కొంగర రివిజన్ కమిటీకి వెళ్లాలనుకున్నారు. అయితే సడన్‌గా మనసు మార్చుకుని 25 కట్స్‌కి అంగీకరించి సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోవడం కోలీవుడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
దీనిపై హీరో శివకార్తికేయన్ స్పందించారు. `సెన్సార్ బోర్డ్ వారి సొంత నిబంధనలు, ప్రమాణాల ప్రకారం పని చేస్తోంది. వారు సూచించిన మార్పులను సినిమా సృజనాత్మకతకు భంగం వాటిల్లకుండా ఎలా అమలు చేయాలనే దానిపైనే మా బృందం పూర్తి దృష్టి పెట్టింది. వారు ఈ మార్పులను ఎందుకు సూచించారో తెలుసుకోవడానికి మాకు సమయం లేదు. అంతే కాకుండా సెన్సార్ బోర్డు చిత్ర నిర్మాతలను `హిందీ నా కలను నాశనం చేసింది` అనే సంభాషణను `హిందీ రుద్దడాన్ని వ్యతిరేకించడమే నా ఏకైక కల` అని మార్చమని కోరింది. అదే విధంగా ఇతర దేశాలలో భాషను బలవంతంగా రుద్దడం వల్ల ఆ దేశాలు ఎలా విచ్చిన్నమయ్యాయని చెప్పే వాయిస్ ఓవర్‌ను కూడా మార్చారు.
మాకు చివరి నిమిషంలో మార్పుల గురించి తెలిసింది. ఆ తర్వాతవారు సూచించిన మార్పులు చేసి వాటిని క్యూబ్‌లో అప్‌లోడ్ చేయాల్సి వచ్చింది. మేము ఒక విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకున్నందున సినిమాను విడుదల చేయడమే మా ప్రధాన లక్ష్యం. సెన్సార్ బోర్డు వారి సొంత నిబంధనల ప్రకారం పనిచేస్తోంది. అది మాకు లాభమా నష్టమా అని విశ్లేషించడానికి మాకు సమయం లేదు` అని తెలిపాడు. ఈ కారణాల వల్లే సుధా కొంగర రివిజన్ కమిటీకి వెళ్లలేకపోయిందని, రిలీజ్‌కు సమయం లేకపోవడంతో కాంప్రమైజ్ అయినట్టుగా చెబుతున్నారు.