శివ తర్వాత షోలే మిస్ కాకూడనివి ఇంకేవైనా?
భారతీయ సినిమా దశ దిశను మార్చిన సినిమాగా చరిత్రలో `షోలే`కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోడ్రన్ సినిమా స్థాయిని పెంచిన ఈ చిత్రాన్ని ఫిలింమేకింగ్ స్టూడెంట్స్ విధిగా స్టడీ చేస్తుంటారు.;
ఇటీవలే నాగార్జున- ఆర్జీవీ కాంబినేషన్ కల్ట్ క్లాసిక్ `శివ` థియేటర్లలోకి విడుదలై, అభిమానులను ఆకట్టుకుంది. 4కేలో రీమాస్టర్ చేసిన వెర్షన్ కి డాల్బీ సౌండింగ్ తో ప్రదర్శిండంతో మరో కొత్త సినిమా ఏదైనా చూస్తున్నామా? అని అభిమానులు ఫీలయ్యారు. ల్యాగ్ మొత్తం తీసేసి మరింత క్రిస్పీగా గ్రిప్పింగ్ గా సినిమాని రిలీజ్ చేయడంతో ఇది ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారి జనాల్ని థియేటర్లకు రప్పిస్తోంది.
ఇదే ఒరవడిలో మెగాస్టార్ చిరంజీవి - మోహన్ బాబు- రాధ లాంటి ఎయిటీస్ క్లాస్ తారలు నటించిన కొదమ సింహం చిత్రాన్ని 4కే వెర్షన్ లో విడుదలకు సిద్ధం చేయగా, ఇంతలోనే అమితాబ్ బచ్చన్- ధర్మేంద్ర వంటి లెజెండ్స్ నటించిన షోలే చిత్రాన్ని బాలీవుడ్ లో రీమాస్టర్ వెర్షన్ రిలీజ్ కి సన్నాహకాలు చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది.
భారతీయ సినిమా దశ దిశను మార్చిన సినిమాగా చరిత్రలో `షోలే`కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోడ్రన్ సినిమా స్థాయిని పెంచిన ఈ చిత్రాన్ని ఫిలింమేకింగ్ స్టూడెంట్స్ విధిగా స్టడీ చేస్తుంటారు. రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హేమాహేమీల నటన అసాధారణం. ఇప్పుడు ఈ సినిమాని డాల్బీ సౌండ్ తో 4కేలో మాస్టర్ చేసిన వెర్షన్ ని రిలీజ్ చేయడానికి సర్వసన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే యాభై సంవత్సరాలు పూర్తయింది. ఎన్నోసార్లు టీవీల్లో, యూట్యూబుల్లోను ఈ సినిమాని వీక్షించారు జనం. అయినా ఇప్పుడు రీమాస్టర్ వెర్షన్ వస్తోంది అంటే మరోసారి థియేటర్లలో వీక్షించేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. దాదాపు 1500 థియేటర్లలో ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయనున్నారు.
నేటి జనరేషన్ కి ఈ క్లాసిక్ మూవీని థియేటర్లలో చూసే అవకాశం దక్కడం నిజంగా ఒక వరంగా భావించాలి. శివ, కొదమ సింహం, షోలే .. ఇంకా ఏవైనా మిస్ కాకూడని సినిమాలు ఉన్నాయా? అంటే ఎందుకు లేవు.. ఇండియన్ సినిమా హిస్టరీలో క్లాసిక్స్ అనదగ్గవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కాకపోయినా ప్రజాదరణ పొందుతాయనే నమ్మకం ఉన్నవాటిని రీమాస్టర్ చేసిన వెర్షన్లలో రిలీజ్ చేసేందుకు ఆస్కారం లేకపోలేదు.