'షోలే' కోసం నంబర్ వన్ పారితోషికం?
బాలీవుడ్ లో క్లాసిక్ డే బ్లాక్ బస్టర్ హిట్ `షోలే` గురించి ఎప్పటికీ చర్చ సాగుతూనే ఉంటుంది.;
బాలీవుడ్ లో క్లాసిక్ డే బ్లాక్ బస్టర్ హిట్ `షోలే` గురించి ఎప్పటికీ చర్చ సాగుతూనే ఉంటుంది. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటి. 1975లో విడుదలైన ఈ సినిమాకు సలీమ్- జావేద్ రచయితలు. తరాలు మారుతున్నా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంలో ఈ క్లాసిక్ కి ఉన్న గుర్తింపు వేరు. ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అమ్జాద్ ఖాన్, హేమ మాలిని, జయ బచ్చన్ వంటి దిగ్గజ తారలు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో నటీనటులంతా తమ అసమాన నట ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలపై శాశ్వత ముద్ర వేసారు. ఆర్డీ బర్మన్ సంగీతానికి గొప్ప పేరొచ్చింది. ధర్మేంద్ర లాంటి అగ్ర హీరో ఈ సినిమాతో ఒక వెలుగు వెలిగారు. ఇందులో నటించిన తారలందరి కెరీర్ అమాంతం మారిపోయింది.
ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు?
అయితే ఈ సినిమాలో నటీనటులకు ఆ రోజుల్లో పారితోషికాలు ఎలా అందాయో తెలుసుకోవాలనే కుతూహలం నేటి జెన్ జెడ్ కి ఉంది. నాటి సినిమాల్లో సంచలన వసూళ్లను సాధించిన షోలే నిర్మాతల భవిష్యత్ ని మార్చేసింది. వారంతా భారీగా ఆర్జించారు. అయితే ఆర్టిస్టుల పారితోషికాలు అప్పట్లో లక్షల్లోనే ఉండేవి. దాదాపు రూ. 3 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. ప్రధాన నటుల్లో ధర్మేంద్రకు రూ. 1,50,000 పారితోషికం చెల్లించగా, సంజీవ్ కుమార్ కు రూ. 1,25,000 చెల్లించారు. అమితాబ్ బచ్చన్ కు రెండవ హీరోగా నటించినా సంజీవ్ కుమార్ కంటే తక్కువ పారితోషికం లభించింది. అమితాబ్ కేవలం రూ. 1,00,000 పారితోషికం అందుకున్నారు.
తక్కువ పారితోషికం:
ఈ చిత్రంలో బసంతి పాత్ర పోషించిన హేమ మాలిని తన పాత్రకు రూ. 75,000 పారితోషికం చెల్లించారు. గబ్బర్ సింగ్ పాత్రధారి అమ్జాద్ ఖాన్ తన మొదటి చిత్రానికి రూ. 50,000 పారితోషికం అందుకున్నారు. రాధ పాత్ర పోషించిన జయ బచ్చన్ కేవలం రూ. 35,000 మాత్రమే అందుకున్నారు. సాంబ పాత్ర పోషించిన మాక్ మోహన్ కు రూ. 12,000 ఫీజు, కాలియా పాత్ర పోషించిన విజు ఖోటేకు రూ. 10,000 .. ఇమామ్ సాబ్ పాత్ర పోషించిన ఎకె హంగల్ కు రూ. 8,000 మాత్రమే పారితోషికం లభించింది. షోలే తో ఒక బెంచ్ మార్క్ పారితోషికాలుగా ఇవి రిజిస్టర్ కాగా, ఆ తర్వాత ఈ తారలంతా అమాంతం తమ రేంజును పెంచుకున్నారు. ఒక్కో విజయంతో పారితోషికాలు పెంచడాన్ని కొనసాగించారు.
దర్శక నిర్మాతలకు మంచి పేరు:
ఎన్.హెచ్ స్టూడియోజ్ - సిప్పీ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో నిర్మించాయి. అప్పటికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది షోలే. ఈ చిత్రంలో అద్భుత కథ, కథనం, నట ప్రదర్శనలకు మంచి పేరొచ్చింది. దర్శకుడు రమేష్ సిప్పి, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.డి. బర్మన్‌కు కూడా మంచి పేరొచ్చింది.