ఫాలోవర్స్ లేక సినిమాల్లోంచి తీసేసారు: శివాత్మిక రాజశేఖర్
సీనియర్ హీరో రాజశేఖర్- జీవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ సినీరంగంలోనే ఉన్నారు.;
సీనియర్ హీరో రాజశేఖర్- జీవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ సినీరంగంలోనే ఉన్నారు. కథానాయికలుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పెద్దమ్మాయి శివానీ ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రసీమల్లో నటిస్తోంది. మరోవైపు చిన్న కుమార్తె శివాత్మిక తెలుగులో మూడు సినిమాలు, తమిళంలో రెండు సినిమాల్లో నటించేసింది. అయినా ఇప్పటికీ స్టార్ గా అవకాశాలు అందుకునేందుకు ఇబ్బంది పడుతున్నానని నిజాయితీగా అంగీకరించింది.
అయితే తనకు అవకాశాలివ్వాలంటే మేనేజర్లు ఇన్ స్టాగ్రమ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోమని సలహా ఇచ్చారట. ఈ రోజుల్లో నటిగా అవకాశాలు రావాలంటే ఇన్ స్టా ఫాలోవర్స్ కావాలని అన్నారని, అసలు నటనకు దీనితో సంబంధం ఏమిటి? అని కూడా శివాత్మిక ఆవేదన చెందింది. తనకు ఫాలోవర్స్ లేక సినిమాల్లోంచి తప్పించారని, ఇన్ స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వారికి అవకాశాలిస్తున్నారని కూడా శివాత్మిక తాజా వీడియో చాట్ లో వెల్లడించింది. ఒక నటిగా రాణించాలంటే నటన రావాలి.. ఆ పాత్రకు సూటవ్వాలి. అంతేకానీ ఇన్ స్టాగ్రమ్ లో ఫాలోవర్స్ పెంచుకోవాలని చెబుతారా? అంటూ డిజిటల్ యుగంలో మారిన సన్నివేశం గురించి, కొత్త ఇబ్బందుల గురించి మాట్లాడింది. నేను నటిని.. కంటెంట్ క్రియేటర్ ని కాను అని కూడా శివాత్మిక అన్నారు.
శివాత్మిక 2019లో దొరసాని అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇందులో ఆనంద్ దేవరకొండ హీరో. ఓ మోస్తరుగా ఆడింది ఈ చిత్రం. తర్వాత పంచతంత్రం, రంగ మార్తాండ చిత్రాల్లో నటించింది. తమిళంలోను ఓ రెండు సినిమాలు చేసింది. కానీ ఇటీవల ఆశించిన అవకాశాలేవీ రాలేదు. సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకోవాలనే డిజిటల్ సూత్రాన్ని అనుసరించడాన్ని కొంత ఇబ్బందిగా ఫీలవుతోంది శివాత్మిక.