CM విజ‌య్‌కి తెలంగాణ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యతో పోలికేంటి శివ‌న్నా?

కన్నడ పవర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

Update: 2026-05-28 00:30 GMT

కన్నడ పవర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ప్రస్తుతం వరుస పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా క్రేజీ తెలుగు చిత్రం `పెద్ది` ప్రమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌గా మారాయి. నటుడిగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించి ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో `తమిళగ వెట్రి కజగం` (టీవీకే) పార్టీ ద్వారా భారీ విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించిన విజయ్ నిజాయితీని ఆయన కొనియాడారు. విజయ్‌లో ఉన్న ప్రజాకర్షణ , చిత్తశుద్ధి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శివరాజ్‌కుమార్ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ముఖ్యంగా తెలంగాణకు చెందిన ప్రముఖ గిరిజన హక్కుల నాయకుడు, ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కమ్యూనిస్ట్ దిగ్గజం గుమ్మడి నరసయ్యతో ముఖ్యమంత్రి విజయ్‌ను శివరాజ్‌కుమార్ పోల్చడం విశేషం. ప్రస్తుతం తాను గుమ్మడి నరసయ్య జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎల్లందు నియోజకవర్గం నుంచి సుదీర్ఘ కాలం (1983-1994, 1999-2009) ఎమ్మెల్యేగా పనిచేసినా ఎంతో సామాన్య జీవితాన్ని గడిపిన నరసయ్య కథ తనను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసిందని చెప్పారు. నరసయ్య లాగే విజయ్‌కు కూడా ప్రజలతో నేరుగా మమేకమై మార్పు తీసుకురాగల అద్భుతమైన సామర్థ్యం ఉందని ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ``గుమ్మడి నరసయ్య గారి కథ విన్నప్పుడు మనుషులు నిజంగా ఇంత నిరాడంబరంగా ఉంటారా అని ఆశ్చర్యపోయాను. సమాజంలో అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. విజయ్ సార్‌లో కూడా నాకు అలాంటి అంకితభావమే కనిపించింది. ఆయన ఎన్నికల్లో నిలబడినప్పుడు.. ప్రజల సమస్యలపై మాట్లాడిన తీరు నా హృదయాన్ని తాకింది. వ్యవస్థలో మార్పు రావాలని నేను కోరుకున్నాను.. దేవుడు ఆయన రూపంలో ఆ మార్పును నిజం చేశాడు`` అంటూ విజయ్ నిజాయితీకి భగవంతుడి ఆశీస్సులు లభించాయని పేర్కొన్నారు.

ఇక సినిమా సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడంపై స్పందిస్తూ.. ప్రజలకు సేవ చేయాలనే నిజాయితీ గల ఆసక్తి ఉన్నప్పుడు నటీనటులు రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమేనని శివ‌న్న‌ అభిప్రాయపడ్డారు. అయితే తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మా నాన్నగారు (రాజ్‌కుమార్) లాగే నేను కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాను. నా భార్య గీతా శివరాజ్‌కుమార్ (కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప కుమార్తె) ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఆమెకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. పదవులు లేకపోయినా నటుడిగా నాకు తోచినంత సేవ చేస్తూనే ఉంటాను! అని శివరాజ్‌కుమార్ వివరించారు.

శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా `పెద్ది` చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ కథానాయికగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం రాబోయే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో శివ‌రాజ్ కుమార్ న‌ట‌న ఎలా ఉంటుందో చూడాల‌ని క‌న్న‌డిగులు స‌హా తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News