సూపర్ స్టార్ షాకింగ్ లుక్... ఏఐ మాయాజాలమా?
అయితే ఈయన కన్నడంలో చేస్తున్న '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' సినిమాపై అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.;
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. కన్నడ సినిమాల్లోనే కాకుండా తమిళ్ మూవీ జైలర్ 2తో పాటు తెలుగు మూవీ 'పెద్ది' సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈయన కన్నడంలో చేస్తున్న '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్' సినిమాపై అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సప్త సాగరాలు దాటి సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు హేమంత్ ఎం రావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా నెలలు అయింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
జులై 12న శివ రాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం జరిగింది. సినిమాలో శివ రాజ్ కుమార్ కాస్త ఏజ్డ్ వ్యక్తిగా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్‌ను చూస్తే అనిపిస్తుంది. సూట్ ధరించి, చేతిలో పిస్టల్ పట్టుకుని ఉన్న శివ రాజ్ కుమార్‌ను చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. శివ రాజ్ కుమార్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో, ఈ లుక్‌లో చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు అంటూ కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఆయన వీరాభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శివ రాజ్ కుమార్ న్యూ లుక్‌పై ఫ్యాన్స్ కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే కొందరు బాగుందని అంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఏఐ ఎక్కువ అయింది. దాంతో ఇది ఏమైనా ఏఐ తో క్రియేట్ చేసిన పోస్టర్ అయ్యి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏఐ మాయాజాలం కారణంగానే శివ రాజ్ కుమార్ ఇలా కనిపిస్తున్నాడేమో అని కొందరు అంటున్నారు. కొందరు మాత్రం శివ రాజ్ కుమార్ క్యాన్సర్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చికిత్స తీసుకున్నారు. ఆ కఠిన చికిత్స కారణంగా శివ రాజ్ కుమార్ గుర్తు పట్టనంత బలహీన పడ్డారు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శివ రాజ్ కుమార్ లుక్ ఎలా ఉన్నా ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన కారణంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. శివన్నా స్వాగతం అంటూ సోషల్ మీడియాలో కన్నడ సినీ ప్రేమికులు సందడి చేస్తున్నారు.
శివరాజ్ కుమార్ రెట్రో లుక్‌లో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమా పీరియాడిక్ డ్రామా అని అర్థం అవుతోంది. చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 1970 టైమ్ జోన్ కథతో తీసినట్లు తెలుస్తోంది. కన్నడంలో రూపొందుతున్న ఈ సినిమాను శివరాజ్ కుమార్‌కి ఇక్కడ ఉన్న క్రేజ్ నేపథ్యంలో తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. పైగా దర్శకుడు హేమంత్ సినిమా సప్త సాగరాలు దాటి తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే శివ రాజ్ కుమార్, హేమంత్ కాంబోలో రాబోతున్న '666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్'ను తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. తమిళ్, హిందీ రిలీజ్‌లపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.