నాగార్జున 'శివ' 4కే వెర్షన్ టీజర్ 'కూలీ'తో?
మొదటి టీజర్ ఆగస్టు 14న విడుదల కానున్న `కూలీ` చిత్రానికి జోడించారు. డాల్బీ అట్మోస్‌లో 4 కె విజువల్స్‌తో `శివ మూవీ కొత్త సౌండ్‌ను ఆస్వాధించవచ్చని కూడా మేకర్స్ చెబుతున్నారు.;
అక్కినేని నాగార్జున కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన `శివ` కల్ట్ క్లాసిక్ జానర్‌లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. డెబ్యూ దర్శకుడైన ఆర్జీవీ నాగ్ ని ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాడు. 05 అక్టోబర్ 1989లో ఈ చిత్రం విడుదలైంది. నాగార్జున, రఘువరణ్, జేడి చక్రవర్తి సహా చాలా మంది నటీనటుల జీవితాలను మార్చిన చిత్రమిది. ఆర్జీవీ క్రేజ్ మొదటి సినిమాతోనే పీక్స్ కి చేరుకుంది. ఈ సినిమా నాటి యువతరాన్ని ఏ రేంజులో ప్రభావితం చేసింది అంటే, ఇందులో కాలేజ్ విద్యార్థి అయిన నాగార్జున సైకిల్ చైన్ తెంచి శత్రువులతో పోరాడే సన్నివేశం ట్రెండ్ సెట్ చేసింది. సైకిల్ చైన్ సీన్ ని కాలేజ్ విద్యార్థులు దశాబ్ధాల పాటు అనుకరించారంటే అర్థం చేసుకోవచ్చు. అంతటి ప్రభావం చూపించిన చిత్రమిది. నాగార్జున కెరీర్ బెస్ట్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాలో జేడి చక్రవర్తి, అమల, రఘువరన్, శుభలేఖ సుధాకర్, తనికెళ్ల భరణి లాంటి నటులు అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం, క్లాసిక్ అనదగ్గ పాటలు ప్రధాన బలం. ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ మాస్టర్ క్లాస్ వర్క్ కి ప్రశంసలు కురిసాయి.
4కే రీమాస్టరింగ్ వెర్షన్
అయితే ఇప్పుడు 4కేలో రీమాస్టరింగ్ చేసిన కొత్త వెర్షన్ రీరిలీజ్ చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధమవుతోంది. శివ చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళం, హిందీలో కూడా రీరిలీజ్ చేస్తామని ప్రకటించారు.
మొదటి టీజర్ ఆగస్టు 14న విడుదల కానున్న `కూలీ` చిత్రానికి జోడించారు. డాల్బీ అట్మోస్‌లో 4 కె విజువల్స్‌తో `శివ మూవీ కొత్త సౌండ్‌ను ఆస్వాధించవచ్చని కూడా మేకర్స్ చెబుతున్నారు. ఆసక్తికరంగా ఏఐ సాంకేతికతను ఉపయోగించి పూర్తిగా సౌండ్ ని రీడిజైన్ చేసారు.
అన్నపూర్ణ 50వ వార్షికోత్సవం:
అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా శివ చిత్రాన్ని మళ్ళీ థియేటర్లలోకి రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తుండటం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. శివ శబ్దాన్ని ఒరిజినల్ మోనో మిక్స్ నుండి డాల్బీ అట్మోస్‌కు పూర్తిగా మార్చడం ఇదే తొలిసారి. అధునాతన ఏఐ ఇంజనీరింగ్‌తో దీనిని సాధ్యం చేసారని తెలుస్తోంది.
కొత్త డాల్బీ శబ్ధంతో కొత్త అనుభూతి:
హీరోగా ఒక హోదాను ఇచ్చిన ఈ సినిమా గురించి సంవత్సరాల తర్వాత కూడా చర్చించుకుంటున్నారు. నా సోదరుడు వెంకట్, నేను రీరిలీజ్ కోసం ప్లాన్ చేసాము. 4కే వెర్షన్ అత్యుత్తమ నాణ్యత కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ కల్ట్ క్లాసిక్ ని యూట్యూబ్ లో ఆదరించిన నేటి కొత్త తరానికి రుణపడి ఉంటాము. 4కేలో అద్భుతమైన డాల్బీ అట్మోస్ సౌండ్ తో దీనిని థియేటర్లలో అందించాలని నిర్ణయించాము అని తెలిపారు. ప్రజలంతా అప్పట్లో చూసేసిన ఈ సినిమాని ఇప్పుడు కొత్త డాల్బీ శబ్ధంతో చూడడం సరికొత్త అనుభూతినిస్తుందని ఆర్జీవీ అన్నారు. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన నాగార్జున, వెంకట్ లకు రుణపడి ఉంటానని తెలిపారు.