శివన్న వ్యాఖ్యలతో అభిమానులు కన్నీటి పర్యంతం!
ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు.;
క్యాన్సర్ బారిన పడిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది మహమ్మారిని జయిస్తే మరికొంత మంది మృత్యువాత పడ్డారు. సోనాలి బింద్రే, మనీషా కోయిరాలా, సంజయ్ దత్, మమతా మోహన్ దాస్, ఛావి మిట్టల్, మహిమా చౌదరి, రాకేష్ రోషన్, హంసా నందిని, హీనాఖాన్ లాంటి వారు క్యాన్సర్ ను జయించిన వారే.తాజాగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా క్యాన్సర్ ను జయించిన సంగతి తెలిసిందే. అమెరికాలో సర్జరీలు చేయించుకుని మహమ్మారి నుంచి బయట పడ్డారు. ఆ తర్వాత ఆయన పెద్దగా బయట కనిపించలేదు.
అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు సందేశాలు పంపించారు తప్ప! మీడియా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా ప్రమోషన్ లో నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆయన వ్యాఖ్యలతో అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. క్యాన్సర్ ను జయించడం పూర్వజన్మ సుకృతంగా భావించారు. `గత డిసెంబర్ లో క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లా. ఆ సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యాను. ఎంతో ఆందోళనకు గురయ్యాను. భయం ఆవహించింది. సర్జీరి చేసిన ఐదు గంటలకు స్పృహలోకి వచ్చాను.
నేను తిరిగి వస్తాననుకోలేదన్నారు. ఆ సమయంలో నా భార్య చేయి పట్టుకున్నప్పుడు ఇలాంటి రోజు ఒకటి మళ్లీ ఉంటుందని ఎంత మాత్రం ఊహించలేదు. ఇదే విషయాన్ని నా భర్యకు చెప్పాను. తను ఎంతో ఎమోషన్ అయింది. చికిత్స అనంతరం తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. నాకు ఫోన్ చేసి ఎలా ఉందని అని చాలా మంది అడిగేవారు. ఆ సమయంలో నా కంట కన్నీళ్లు తిరిగేవి. ఇలాంటి ప్రేమ ఎవరికి దక్కుతుంది? ఎంత డబ్బు సంపాదించినా? అభిమానుల ప్రేమను సంపాదించడం మాత్రం కష్టమని ఎమోషనల్ అయ్యారు.
శివన్న సినిమాల విషయానికి వస్తే తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న `పెద్ది` లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శివ రాజకుమార్ పాత్ర పాజిటివ్ గా ఉంటుందా? నెగిటివ్ రోల్? అన్నది ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే శివరాజ్ కమార్ పై షూటింగ్ కూడా పూర్తి చేసారు. రామ్ చరణ్ తో చాలా కాంబినేషన్ సన్నివేశాలున్నట్లు తెలుస్తోంది. కుస్తీ పోటీకి సంబంధించిన సన్నివేశాల్లో శివన్న కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే శివరాజ్ కుమార్ కన్నడలో `45` అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కన్నడలో ఈనెల 25న, తెలుగులో జనవరి 1న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఆసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో శివన్న పాల్గొంటున్నారు.