శిల్పాశెట్టి కుంద్రా ఇంటిపై ఐటీ దాడులు?
అయితే ఈ మోసం కేసులో మీడియా అత్యుత్సాహంపై శిల్పాశెట్టి సీరియస్ గా ఉన్నారు. కేసు విచారణ దశలో ఉంది. సమస్యలకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా నేరపూరిత రంగు పులుముతున్నారు.;
ప్రముఖ కథానాయిక శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు ఇటీవల ఆర్థిక మోసం, ఈడీ సంబంధిత కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో హవాలా కోణంపై విచారణ సాగుతోందని జాతీయ మీడియాలు కథనాల్ని ప్రచురించాయి. 60కోట్ల మేర మోసం చేసారని ఆరోపిస్తూ ఈ దంపతులపై దీపక్ కొఠారి అనే వ్యాపార వేత్త ఆరోపించడంతో ప్రస్తుతం ఈ గొడవ కోర్టుల పరిధిలో ఉంది.
ఇంతలోనే ఇప్పుడు శిల్పా శెట్టి- కుంద్రా ఇంటిపై ఐటి దాడులు జరిగాయని కథనాలొస్తున్నాయి. ఆమె రెస్టారెంట్ బాస్టియన్‌కు సంబంధించిన ఒక కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ గురువారం నాడు సోదాలు నిర్వహించారని ప్రచారమవుతోంది. అయితే ఇవి సాదారణ తనిఖీలు మాత్రమేనని శిల్పాశెట్టి కుంద్రా లాయర్ చెబుతున్నారు.
చట్టబద్ధంగా బాస్టియన్ రెస్టారెంట్ ని మూసివేయాల్సిన సమయం దాటిన తర్వాత కూడా దానిని అనధికారికంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసినట్టు వార్తలు వచ్చిన రెండో రోజు ఆమె ఇంటిపై ఐటి దాడులు జరిగాయి. అయితే ఒక ప్రకటనలో శిల్పా శెట్టి న్యాయవాది ఎలాంటి దాడి జరగలేదని అన్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సాధారణ తనిఖీలు మాత్రమే నిర్వహిస్తున్నారని లాయర్ తెలిపారు.
మరోవైపు కోర్టుల పరిధిలో వ్యాపారి దీపక్ కొఠారి ఫైల్ చేసిన కేసు కూడా విచారణ దశలో ఉంది. ఈ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా టీవీ చానెల్ పెట్టుబడుల పేరుతో రుణం, భాగస్వామ్య వాటా పేరుతో 60 కోట్ల మేర మోసం చేసారని కొఠారి ఆరోపించారు. అయితే రాజ్ కుంద్రా తన తండ్రి అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా, దంపతులపై లుకౌట్ నోటీస్ ఉండగా వెళ్లడానికి వీల్లేదని కోర్టు ధృవీకరించింది. ఒకవేళ శిల్పాశెట్టి-కుంద్రా దంపతులు దేశం విడిచి వెళ్లాలంటే 60కోట్ల బ్యాంక్ గ్యారెంటీని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది.
అయితే ఈ మోసం కేసులో మీడియా అత్యుత్సాహంపై శిల్పాశెట్టి సీరియస్ గా ఉన్నారు. కేసు విచారణ దశలో ఉంది. సమస్యలకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేకుండా నేరపూరిత రంగు పులుముతున్నారు. హైకోర్టులో ఇప్పటికే ఒక క్వాషింగ్ పిటిషన్ దాఖలు చేసాం. అది విచారణలో ఉంది. దర్యాప్తుకు పూర్తిగా సహకరించిన మేము న్యాయం గెలుస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నామని అన్నారు. మీడియా సంయమనం పాటించాలని కూడా కోరారు.