అబ్బవరం 'తిమ్మరాజుపల్లి TV'.. శర్వానంద్ ఏమన్నారంటే?
అయితే తాజాగా హీరో శర్వానంద్ ఆ చిత్రం కోసం సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవ్వడం విశేషంగా మారింది.;
వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం... ఇప్పుడు నిర్మాతగా వ్యవహరించిన మూవీ తిమ్మరాజుపల్లి TV. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్మించిన ఆ చిత్రం.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్స్ తో ఆసక్తి రేకెత్తించిన ఆ సినిమా విడుదల అనంతరం మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంటోంది.
అయితే తాజాగా హీరో శర్వానంద్ ఆ చిత్రం కోసం సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవ్వడం విశేషంగా మారింది. కొత్త ప్రతిభను నమ్మి సినిమా నిర్మించడం అంత ఈజీ కాదని పేర్కొన్న ఆయన.. కిరణ్ అబ్బవరం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలిపారు. ఒకేసారి 40 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం అంటే 40 కలలకు వేదిక కల్పించినట్లేనని, బ్రదర్ కిరణ్ ప్రయత్నం ప్రత్యేకమని కొనియాడారు.
ఇప్పటికే తాను సినిమా గురించి మంచి స్పందన వింటున్నానని, తన అప్ కమింగ్ షూటింగ్ పూర్తయ్యాక తప్పకుండా చూస్తానని శర్వానంద్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా హీరోలు.. సినిమా చూసి రివ్యూ ఇస్తూ స్పందిస్తారు. కానీ శర్వానంద్ మాత్రం.. ముందే కాస్త బూస్ట్ ఇచ్చి.. మూవీ చూస్తానని చెప్పడం విశేషం.
అయితే కంటెంట్ పరంగా చూస్తే తిమ్మరాజుపల్లి TV మూవీ భారీ రేంజ్ లో ఆకట్టుకోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ నిర్మాతగా కిరణ్ అబ్బవరం తీసుకున్న వ్యూహం మాత్రం చర్చనీయాంశమైంది. తక్కువ బడ్జెట్ లో సినిమా పూర్తి చేసి, డిజిటల్ హక్కుల ద్వారా పెట్టుబడి తిరిగి పొందడం ఆయన తెలివైన ప్రణాళిక అని చెప్పాలి.
దీంతో థియేటర్లలో వచ్చే వసూళ్లు లాభాలుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కథ పల్లెటూరి నేపథ్యంలో, ఒక టీవీ చుట్టూ తిరిగే కథతో దర్శకుడు మునిరాజు తెరకెక్కించారు. మొదటి భాగం సాధారణ ప్రేమకథతో సాగుతూ, గ్రామీణ కామెడీ ద్వారా కథను ముందుకు నడిపించే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే అదే భాగం కొంత మందికి బోరింగ్ గా అనిపించిందని టాక్ వినిపిస్తోంది. అసలు కథలో మలుపులు, మిస్టరీ అంశాలు రెండో భాగంలో బయటపడతాయి.
ఇక సినిమాలో ప్రత్యేకంగా నిలిచింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. కొన్ని సన్నివేశాలను సంగీతం బాగా ఎలివేట్ చేసిందని ప్రేక్షకులు చెబుతున్నారు. క్లైమాక్స్ లో ఫీల్ గుడ్ ఎమోషన్ తో ముగించడం ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. కొత్తవారైన సాయి తేజ, ప్రదీప్ కొట్టే, వేద తదితరులు తమ పాత్రల్లో సహజంగా నటించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా చిత్తూరు యాసలో వారు మాట్లాడిన తీరు నిజ జీవితానికి దగ్గరగా అనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తిమ్మరాజుపల్లి TV ఒక రియలిస్టిక్ ప్రయత్నంగా నిలిచింది. పూర్తి స్థాయి నిర్మాతగా కిరణ్ అబ్బవరం తొలి అడుగు ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.