భారీ పోటీలోనూ భయం లేని హీరో!
కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఇవేవి ఆలోచించడు. ఎదురు ఎంత పెద్ద హీరో ఉన్నా? ఢీ అంటే ఢీ అనే అంటాడు.ఇంతకీ ఎవరా హీరో అంటే? యంగ్ హీరో శర్వానంద్.;
సాధారణంగా చాలా మంది యువ హీరోలు స్టార్ హీరోలకు పోటీగా తమ సినిమాల్ని రిలీజ్ చేయాలంటే భయప డతారు. వాళ్లతో పోటీ ఎందుకని వెనక్కి తగ్గుతారు. సరైన థియేటర్లు కూడా దొరకవని ఆందోళన చెందుతారు. స్టార్ హీరోలు రిలీజ్ లు లేని సమయం చూసుకుని తమ సినిమా రిలీజ్ చేస్తే లాభాలొస్తాయని ఆలోచిస్తారు.
కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఇవేవి ఆలోచించడు. ఎదురు ఎంత పెద్ద హీరో ఉన్నా? ఢీ అంటే ఢీ అనే అంటాడు.ఇంతకీ ఎవరా హీరో అంటే? యంగ్ హీరో శర్వానంద్. అవును ఇతగాడు 2026 సంక్రాంతికి కూడా స్టార్ హీరోలతో పోటీకి సిద్దమైన సంగతి తెలిసిందే.
2026 లోనూ అదే దూకుడుతో:
అందులోనూ స్టార్ హీరోలంతా ముందే డేట్లు ఫిక్స్ చేసుకుని రెడీగా ఉన్నా? శర్వా ఎంత మాత్రం వెనక్కి తగ్గకుండా వస్తున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న `నారీ నారీ నడుమ మురారీ`ని సంక్రాతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు తాజా గా ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ తేదీ ఇవ్వలేదు గానీ సీజన్ మాత్రం మిస్ కామంటూ వెల్లడించారు. దీంతో శర్వానంద్ చిరంజీవి, రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్లకు పోటీగా దిగుతున్నాడని తేలిపోయింది. అయితే ఇలా స్టార్లతో పోటీ పడటం అన్నది శర్వాకు అలవాటైన పనే.
సీనియర్లతోనూ శర్వా పోటీ:
2016 సంక్రాంతికి నాగార్జున నటించిన `సొగ్గాడే చిన్ని నాయనా`, ఎన్టీఆర్ నటించిన `నాన్నకు ప్రేమతో` లాంటి బిగ్ రిలీజ్ లున్నా? శర్వా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.అదే సమయంలో తాను హీరోగా నటించిన `ఎక్స్ ప్రెస్ రాజా`ని రిలీజ్ చేసాడు. అంత పోటీ ఉన్నా? ఎక్స్ ప్రెస్ రాజా భారీ విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది కూడా అదే సన్నివేశాన్ని రిపీట్ చేసాడు. 2017 సంక్రాంతికి ఏకంగా ఇద్దరు సీనియర్లతోనే పోటీ పడ్డాడు. చిరంజీవి హీరోగా కంబ్యాక్ అవుతోన్న `ఖైదీ నెంబర్ 150` చిత్రం సంక్రాంతి కానుకగానే రిలీజ్ అయింది. అదే ఏడాది బాలయ్య నటించిన `గౌతమీ పుత్రశాతకర్ణి` కూడా ప్రేక్షలకు ముందుకొచ్చింది. దీంతో చిరు-బాలయ్య మధ్య గట్టి టఫ్ ఫైట్ నడుస్తుందని..ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సక్సెస్ సెంటిమెంట్ కొనసాగిస్తాడా?
అయినా ఎవరు వెనక్కి తగ్గలేదు. ఇలాంటి సమయంలో కూడా శర్వా వెనక్కి తగ్గలేదు. అతడు నటించిన `శతమానం భవతి` అదే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతికి పర్పెక్ట్ రిలీజ్ గా ప్రేక్షకుల్ని అలరిం చింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా రికార్డు వసూళ్లను సాధించింది. తాజాగా 2026 సంక్రాంతికి శర్వానంద్ శంకరవరప్రసాద్, రాజాసాబ్, భర్తమహాశయులతో పోటీకి సిద్దమయ్యాడు. మరి ఈ సారి శర్వానంద్ సక్సెస్ సెంటిమెంట్ కొనసాగిస్తాడా? లేదా? అన్నది చూడాలి.