రిస్క్ తగ్గించి రికార్డులు కొట్టడమే ఆ ఇద్ద‌రి లక్ష్యం!

సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే తమదైన ముద్ర వేసిన ఇద్దరు అగ్ర దర్శకులు శంకర్, ఏఆర్ మురగదాస్.

Update: 2026-06-12 02:45 GMT

సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే తమదైన ముద్ర వేసిన ఇద్దరు అగ్ర దర్శకులు శంకర్, ఏఆర్ మురగదాస్. ఒకప్పుడు ఇద్ద‌రి పేర్లు వింటేనే బాక్సాఫీస్ రికార్డులు కంపింపజేసేవి. భారీ కాన్సెప్ట్‌లు, సమాజానికి అవసరమైన సందేశాలు, వాటికి తోడు అద్భుతమైన విజువల్స్ జోడించి కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఇద్ద‌రు చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇద్దరి తదుపరి అడుగులపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

గతంలో ఇద్దరు దర్శకులు స్టార్ హీరోలతో, భారీ బడ్జెట్‌లతో చేసిన సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. శంకర్ విజువల్ వండర్స్‌గా తీర్చిదిద్దిన కొన్ని ప్రాజెక్ట్‌లు భారీ వ్యయం కారణంగా ట్రేడ్ వర్గాల్లో ఆశించిన లాభాలను రాబట్టలేకపోయాయి. అలాగే మురగదాస్ కూడా స్టార్ ఇమేజ్‌ను నమ్ముకుని చేసిన కొన్ని బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ వైఫల్యాలు కేవలం ఆర్థిక పరమైన నష్టాలకే పరిమితం కాకుండా పరిశ్రమలో వారికున్న తిరుగులేని నమ్మకాన్ని కూడా కొంతవరకు దెబ్బతీశాయి.

మార్కెట్ సమీకరణాలు వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఇద్దరు క్రియేటివ్ డైరెక్టర్లు తమ రూట్‌ను మార్చుకోవాలని డిసైడ్ అయినట్లు కోలీవుడ్ వ‌ర్గాల టాక్. కొన్నాళ్ల పాటు భారీ బడ్జెట్‌ల వెనుక పరిగెత్తడం కంటే, కంటెంట్‌ను నమ్ముకుని తక్కువ బడ్జెట్‌లో కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారట. తక్కువ వ్యయంతో నిర్మించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ మోడల్‌ను ఇరు దర్శకులు తమ తదుపరి ప్రాజెక్ట్‌లకు వర్తింపజేయాలని యోచిస్తున్నారుట‌.

ఈ వ్యూహాత్మక మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం నిర్మాతలకు సేఫ్ జోన్ కల్పించడమే. బడ్జెట్ పరిమితి లోపల ఉన్నప్పుడు సినిమాపై రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. కథ బలంగా ఉండి, మేకింగ్ వాల్యూస్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న రోజులివి. అందుకే శంకర్, మురగదాస్ తమ పాత ఫార్ములా అయిన లార్జర్ ద్యాన్ లైఫ్ విజువల్స్ పక్కన పెట్టి కేవలం స్క్రిప్ట్ బలంపైనే పూర్తి శ్రద్ధ పెట్టాలని చూస్తున్నారు. ఇది నిజంగా వారి కెరీర్‌కు రీబూట్ లాంటిదే అని చెప్పాలి.

అయితే ఈ కొత్త పంథాలో వారికి ఎదురవుతున్న అతిపెద్ద సవాలు స్టార్ హీరోల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవడం. గత పరాజయాల ప్రభావం వల్ల ఇప్పుడున్న టాప్ లీగ్ హీరోలు వీరితో తక్షణమే ప్రాజెక్ట్‌లు ఓకే చేయడానికి కొంత వెనుకాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బడ్జెట్ తగ్గించుకుంటామని చెప్తున్నప్పటికీ ఆచరణలో ఈ దర్శకులు ఎంతవరకు కంట్రోల్‌గా ఉంటారనే సంశయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. అందువల్ల వీరి ఆలోచనలకు తగ్గట్టుగా ఇప్పడున్న హీరోలు ముందుకు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే వీరి ముందున్న ప్రధాన టాస్క్.

ఏదేమైనా టాలెంట్‌కు ఎప్పటికీ పరాజయం ఉండదు. శంకర్, మురగదాస్ లాంటి మేధావులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని బరిలోకి దిగితే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలరో గతంలో నిరూపితమైంది. ఇప్పటికైనా భారీ గ్రాఫిక్స్, అనవసరపు ఖర్చులకు స్వస్తి చెప్పి, కేవలం సాలిడ్ కంటెంట్‌తో తక్కువ బడ్జెట్‌లో భారీ హిట్ కొట్టాలనే వారి టార్గెట్ గనుక నెరవేరితే అది సౌత్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కు దారితీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News