షారూఖ్ మన్నత్ నిర్మాణం.. రూల్‌ని అతిక్రమించారా?
ముంబై బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో షారూఖ్ `మన్నత్` పాపులారిటీ గురించి తెలిసిందే.;
ముంబై బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో షారూఖ్ `మన్నత్` పాపులారిటీ గురించి తెలిసిందే. నిరంతరం షారూఖ్ అభిమానులు, టూరిస్టులు ఈ చోటికి వచ్చి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని ఆనందిస్తారు. షారూఖ్ వారికి మన్నత్ ఇంటి బాల్కనీ నుంచి హాయ్ చెప్పి, అభిమానంగా కబుర్లు చెప్పి పంపిస్తుంటారు. అయితే కొన్ని నెలలుగా మన్నత్ ని రెనోవేట్ (పునర్నిర్మిస్తున్న) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భవంతిని తమ అవసరాలకు అనుగుణంగా షారూఖ్ - గౌరీఖాన్ దంపతులు మరింత పెద్దదిగా విస్తరిస్తున్నారని మీడియాలో కథనాలొచ్చాయి. బీఎంసీ నుంచి ఇంతకుముందు అవసరమైన అనుమతులు తీసుకున్నారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే మన్నత్ వారసత్వపు ఆస్తి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలో ఉన్న కాంప్లికేటెడ్ ఏరియా. గ్రూప్ హౌస్ లు నిర్మించేందుకు ఉద్దేశించిన ల్యాండ్ లో మన్నత్ ఉంది. అది కూడా బీచ్ పరిసరాల్లో ఉండటంతో ఇక్కడ ఏం చేయాలన్నా అటవీ శాఖ అధికారులతో పాటు, ముంబై మున్సిపాలిటీ అనుమతులు తప్పనసరి. అయితే మన్నత్ పునర్మిర్మానంలో అవకతవకలు జరుగుతున్నాయని, తప్పుడు విధానంలో దీని విస్తరణ సాగుతోందని వై.పి. సింగ్ అనే వ్యక్తి ఆరోపించడంతో అది అధికారుల దృష్టికి చేరుకుంది. షారూఖ్ మున్సిపల్ అధికారులను మ్యానిప్యులేట్ చేసి ఈ భవంతి విస్తరణ పనులు చేపడుతున్నారని, ప్రస్తుతం ఉన్న ప్రధాన భవంతి వెనక భాగంలో మొత్తం 12 ఇండివిడ్యువల్ ఇండ్లను మాత్రమే నిర్మించాల్సి ఉండగా, గతంలోనే మున్సిపల్ అధికారులను మ్యానేజ్ చేసి మొత్తం ఒకే కుటుంబానికి ఆవాసంగా ఉండేలా ఒక పెద్ద విస్తారమైన బంగ్లాను నిర్మించారని వై.పి.సింగ్ ఆరోపించారు.
ఇది షారూఖ్ కి చిక్కులు తెచ్చినా అతడికి ఉన్న పరపతి దృష్ట్యా దీనిని ఎవరూ టచ్ చేయలేదు. కానీ ఇప్పటికీ ఇది ఖాన్ కి చికాగ్గా మారింది. తాజాగా మరోసారి అటవీ శాఖ అధికారులు ప్రస్తుత రెనోవేషన్ పనులు ఎలా సాగుతున్నాయో పరిశీలించేందుకు మన్నత్ కి వచ్చారని ముంబై మీడియా కథనాలు ప్రచురించింది. తీరప్రాంత నియంత్రణ జోన్ నియమాలను ఉల్లంఘించి ఈ ఇంటిని నిర్మిస్తున్నారనే ఫిర్యాదు మేరకు మాత్రమే అధికారులు వచ్చారని చెబుతున్నారు. తాజా కథనాల ప్రకారం.. అటవీ శాఖ- BMC అధికారుల సంయుక్త బృందం ఖాన్ కి చెందిన బాంద్రా బంగ్లాను సందర్శించి తనిఖీ చేసింది.
అటవీ శాఖకు చెందిన ఒక అధికారి మన్నత్‌లో తనిఖీని ధృవీకరించారు. పునరుద్ధరణ అనుమతుల గురించి మాకు ఫిర్యాదు అందినందున ఒక బృందం స్థల తనిఖీని నిర్వహించింది. అక్కడ కనుగొన్న వాటి ఆధారంగా ఒక నివేదికను తయారు చేసి త్వరలో సమర్పిస్తామని అన్నారు.