కింగ్ కోసం బాలీవుడ్‌లో ఎప్పుడూ చేయని సాహసం.. షారుఖ్ కొత్త చరిత్ర రాస్తాడా?
బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ ఒకటి.
బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ ఒకటి. ఇప్పటికే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు మరో కారణంతో చర్చనీయాంశమైంది. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హీరో రెమ్యూనరేషన్, ప్రమోషనల్ ఖర్చులు కాకుండా కేవలం ప్రొడక్షన్‌కే ఈ రేంజ్ బడ్జెట్ ఖర్చు పెట్టడం ఈ సినిమాపై మేకర్స్ ఎంత నమ్మకంగా ఉన్నారో తెలియచేయస్తోంది.
ఈ సినిమాను రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ మూవీగా కాకుండా, ఇంట్నేషనల్ క్వాలిటీ ప్రమాణాలకు తగ్గ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. పలు దేశాల్లో నెలల తరబడి షూటింగ్ నిర్వహించడంతో పాటు, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ను రంగంలోకి దింపినట్లు సమాచారం. సినిమాలోని ప్రతి యాక్షన్ బ్లాక్ ఆడియన్స్ కు కొత్త అనుభూతినివ్వాలనే టార్గెట్ తో భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకు మరో మెయిన్ ఎట్రాక్షన్ షారుఖ్ ఖాన్- సుహానా ఖాన్ కాంబినేషన్. తండ్రీ కూతురు ఒకే సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సుహానా కెరీర్‌లో ఇదే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా భావిస్తుండగా, షారుఖ్ తో ఆమె స్క్రీన్ స్పేస్ ఎలా ఉండబోతుందన్నది ఫ్యాన్స్ ను ఆసక్తిగా ఎదురుచూడేలా చేస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో స్టార్ పవర్ కూడా నెక్ట్స్ రేంజ్‌లో ఉండనుంది. షారుక్, సుహానాతో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రాణి ముఖర్జీ, అర్షద్ వార్సీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో కింగ్ మల్టీస్టారర్ ఈవెంట్ మూవీగా మారింది.
యాక్షన్, విజువల్స్, స్టార్ కాస్ట్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు... ఇలా ప్రతి అంశంలో రాజీ పడకుండా తెరకెక్కుతున్న ఈ సినిమా భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇంత భారీ బడ్జెట్‌తో వస్తున్న నేపథ్యంలో బాక్సాఫీస్ అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. సుమారు రూ.450 కోట్ల నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ ద్వారా భారీ ఆదాయం సాధించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్‌వైడ్ గా రిలీజయ్యే ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, షారుఖ్ ఖాన్ తదుపరి భారీ బాక్సాఫీస్ పరీక్షగా కింగ్ నిలవనుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.