సెక్యూర్టీ గార్డ్ విజిల్ వేసినందుకే హీరో సీరియ‌స్!

పద్నాలుగేళ్ల క్రితం ఐపీఎల్ వేదికగా జరిగిన ఓ సంఘటన క్రికెట్ -సినిమా రంగాల్లో పెద్ద దుమారాన్నే రేపింది.;

Update: 2026-05-03 01:30 GMT

పద్నాలుగేళ్ల క్రితం ఐపీఎల్ వేదికగా జరిగిన ఓ సంఘటన క్రికెట్ -సినిమా రంగాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. 2012లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ -స్టేడియం భద్రతా సిబ్బంది మధ్య జరిగిన గొడవ అప్పట్లో ఎంత‌ సంచలనమైందో తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై నాటి ఏసీపీ ఇక్బాల్ షేక్ ఓ పాడ్‌కాస్ట్‌లో అస‌లేం జ‌రిగిందో చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. చిన్న సమాచార లోపంతో అంత పెద్ద రచ్చ జరిగిందని పేర్కొన్నారు. ఆ రోజు కోల్‌కతా నైట్ రైడర్స్ - ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

స్టేడియంలోని మెజారిటీ ప్రేక్షకులు వెళ్లిపోయిన అనంత‌రం షారుఖ్ ఖాన్ తన పిల్లలు, స్నేహితుల పిల్లలతో కలిసి గ్రౌండ్‌లో ఓ మూలన ఆడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడున్న సెక్యూరిటీ గార్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విజిల్ వేశాడు. అది షారుఖ్‌కు కోపం తెప్పించింది. పిల్లల పట్ల సిబ్బంది ప్రవర్తన నచ్చకనే షారుఖ్ కోప‌గించుకున్నారు. గొడవ పెద్దది అవుతోన్న క్రమంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు. మాట మాట పెరిగి వాతావరణం ఉద్రిక్తంగా మారుతోన్న సమయంలో ఏసీపీ ఇక్బాల్ షేక్ రంగంలోకి దిగారు.

పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు వెంటనే షారుఖ్‌ను స్టేడియం వెలుపలికి పంపించేశారు. `సర్ దయచేసి మీరు బయటకు వెళ్లండి` అని నేరుగా చెప్పి, వివాదం మరింత ముదరకుండా అడ్డుకున్నానని ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ వివాదం ఫలితంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ షారుఖ్ ఖాన్‌పై ఐదేళ్ల పాటు వాంఖడే స్టేడియంలోకి రాకుండా నిషేధం విధించింది. షారుఖ్ ఖాన్ భద్రతా సిబ్బందిని దుర్భాషలాడారని, వారితో అసభ్యంగా ప్రవర్తించారని ఎంసీఏ ఆరోపించింది. అయితే పిల్లలను భద్రతా సిబ్బంది నెట్టేసినందుకే తాను అలా ప్రవర్తించాల్సి వచ్చిందని షారుఖ్ అప్పట్లోనే వివరణ ఇచ్చారు. అయితే ఈ నిషేధం మూడు ఏళ్లకే ఎత్తేసారు. ఆ సమయంలో షారుఖ్ స్పందిస్తూ గొడవలో ఎవరు సరైన వారు అనేది ముఖ్యం కాదని హుందాతనం ముఖ్యం అని పేర్కొన్నారు.

షారుఖ్ ఖాన్ సినిమాల విష‌యానికి వ‌స్తే? వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. `పఠాన్`, `జవాన్`, `డంకీ` వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ముఖ్యంగా `పఠాన్`, `జవాన్` చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి షారుక్ స్టార్‌డమ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. తదుపరి చిత్రం `కింగ్` కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో షారుక్ కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.

Tags:    

Similar News