మాజీల‌ను శ‌త్రువుల‌గా చూడొద్దంటోన్న మ‌రో మాజీ భార్య‌!

ఈ పరిణతి చెందిన ఆలోచనా విధానం వల్లే తమ పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతున్నారని వివరించారు.

Update: 2026-06-09 07:26 GMT

సెలబ్రిటీల వైవాహిక బంధాలు ముగిసిపోవడం చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ.. స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత సొహైల్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత కూడా వారి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి ఫ్యాషన్ డిజైనర్ సీమా సజ్దేహ్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విడాకుల తర్వాత తమ మధ్య ఉన్న సంబంధం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.

చట్టపరంగా తాము భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ మధ్య ఉన్న గౌరవం ..సత్సంబంధాలు అలాగే ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకప్పుడు కలిసి జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో శతృత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదని.. పరిస్థితులకు అనుగుణంగా బంధాల స్వరూపం మారినా ఆప్యాయత అలాగే ఉంటుందని అభిప్రా యపడ్డారు. కుమారులు నిర్వాణ్ ఖాన్, యోహాన్ ఖాన్‌ల భవిష్యత్తు ..పెంపకం విషయంలో తామిద్దరం ఎప్పుడూ ఒకే మాటపై ఉంటామని సీమా పేర్కొన్నారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నెరవేర్చడంలో విడాకులు అడ్డురాలేదని.. పిల్లల సంతోషం కోసం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

ఈ పరిణతి చెందిన ఆలోచనా విధానం వల్లే తమ పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతున్నారని వివరించారు. ఖాన్ కుటుంబంతో తనకున్న అనుబంధం కేవలం పెళ్లితోనే ముగిసిపోలేదని ఇప్పటికీ వారంతా తన జీవితంలో ఒక భాగమేనని సీమా సజ్దేహ్ చెప్పుకొచ్చారు. పండుగలు, ప్రత్యేక కుటుంబ వేడుకల్లో తామంతా కలిసి పాల్గొంటామని.. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలబడతామన్నారు. విడిపోవడమనేది జీవితంలో చిన్న భాగం మాత్రమేనని దానివల్ల మిగిలిన బంధాలను తెంచుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

సమాజంలో విడాకులను పెద్ద విపత్తుగా, చేదైన ముగింపుగా చూసే ధోరణి ఎక్కువగా ఉంటుంది. కానీ సీమా సజ్దేహ్ -సొహైల్ ఖాన్ల ప్రయాణం అలాంటి ఆలోచనను మారుస్తోంది. పరస్పర అంగీకారంతో ఎలాంటి వివాదాలు లేకుండా విడిపోయి ఒకరి ఎదుగుదలను మరొకరు ఆకాంక్షించడం అనేది నేటి తరం జంటలకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో నిరంతరం ఉండే ఒత్తిడి, ప్రచారాల మధ్య కూడా వ్యక్తిగత జీవితంలోని ప్రశాంతతను కాపాడుకోవడం అంద‌రికీ సాధ్యంకాదు. ఒక‌ స్వతంత్ర మహిళగా, డిజైనర్‌గా తన వృత్తిలో రాణిస్తూనే, కుటుంబ బాధ్యతలను ఎంతో హుందాగా నిర్వహిస్తున్న సీమా సజ్దేహ్ ధోరణి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Tags:    

Similar News