'పెద్ది' బెజ‌వాడ ఈవెంట్: 'గ్యాంగ్ లీడ‌ర్- ఇంద్ర' వైబ్స్ గుర్తొచ్చాయ‌న్న నిర్మాత‌లు

మరో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ``పెనమలూరు తన స్వస్థలమని.. చదువుకున్న విజయవాడలోనే తొలి సినిమా ఈవెంట్ ని ఇంత భారీగా జరుపుకోవడం చరణ్ వల్లే సాధ్యమైంద``ని కృతజ్ఞతలు తెలిపారు.

Update: 2026-06-02 04:07 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ `పెద్ది` ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ భారీ వేడుకలో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ -చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు సినిమాపై తమకున్న నమ్మకాన్ని, రామ్ చరణ్ అంకితభావాన్ని ప్రశంసస్తూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. తమ సొంత గడ్డపై ఇంతటి భారీ కార్య‌క్ర‌మం జరగడంపై ఇరువురు నిర్మాత‌లు హర్షం వ్యక్తం చేశారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు, మైత్రి అధినేత‌ వై. రవిశంకర్ మాట్లాడుతూ.. తామంతా విజయవాడలోనే పుట్టి పెరిగామని.. ఈ వేడుక చూస్తుంటే చిరంజీవి గారి విజేత, గ్యాంగ్ లీడర్, ఇంద్ర సినిమాల విజయోత్సవాలు గుర్తొస్తున్నాయని అన్నారు. వాటిని తలదన్నేలా చరణ్ ఈ వేడుక ఇక్కడ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటివరకు ఈ సినిమాను వందమందికి చూపించగా అందరూ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని చెప్పారని.. `రంగస్థలం` కంటే ఇందులో చరణ్ పెర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చిత్రం చూసి అవార్డు కమిటీలు ఒకటికి రెండు అవార్డులు ఇవ్వాల్సిందేనని... దర్శకుడిగా బుచ్చిబాబు మరో స్థాయికి వెళ్లారని ప్రశంసించారు.

మరో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ.. ``పెనమలూరు తన స్వస్థలమని.. చదువుకున్న విజయవాడలోనే తొలి సినిమా ఈవెంట్ ని ఇంత భారీగా జరుపుకోవడం చరణ్ వల్లే సాధ్యమైంద``ని కృతజ్ఞతలు తెలిపారు. ఒక చిన్న ఊరి నుంచి వచ్చిన వ్యక్తి దేశవ్యాప్తంగా మెచ్చేలా ఎలా ఎదిగాడనేదే `పెద్ది` కథ అని.. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా కోసం చరణ్ రెండేళ్లకు పైగా శ్రమించారు.. షూటింగ్‌లో మూడు సార్లు గాయాలైనా లెక్కచేయలేదని వెల్లడించారు.

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ఇద్దరు నిర్మాతలు కొనియాడారు. రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పిస్తుందని సతీష్ కిలారు చెప్పారు. సినిమాను దాదాపు 280 రోజుల పాటు ఎంతో అంకితభావంతో నిర్మించామని.... సహకరించిన చిత్ర బృందానికి -నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సినిమా ప్ర‌మోష‌న్లు విజయవంతం కావడానికి సహకరించిన ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్, భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి -పోలీస్ శాఖకు నిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు. `పెద్ది` చిత్రం జూన్ 3న ప్రీమియర్స్ తో మొద‌లై, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుందని.. మూడు గంటల పాటు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ఈ ఎక్స్‌ట్రార్డినరీ సినిమాను థియేటర్లలోనే చూడాలని కోరారు.


Tags:    

Similar News