లావణ్య త్రిపాఠి "సతీ లీలావతి".. ట్రైలర్ ఎలా ఉందంటే?
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం సతీ లీలావతి ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.;
మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం సతీ లీలావతి ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాను భీమిలి కబడ్డీ జట్టు, SMS చిత్రాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ మూవీ మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఆ సినిమా ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయడం విశేషం.
ట్రైలర్ ప్రారంభంలోనే సీనియర్ నటుడు నరేష్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. "20 ఏళ్ల నా పెంపకంలో కనబడని నవ్వు.. మూడేళ్ల మీ సంసార జీవితంలో కనిపిస్తుంది" అంటూ చెప్పే మాటలతో కథలోని భావోద్వేగాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత కథ ఫన్నీగా ముందుకు సాగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, అలకలు, ఇగో సమస్యల నేపథ్యంలో కథ నడుస్తుంది.
ఇందులో లావణ్య లీలావతి పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించారు. ముఖ్యంగా భర్తను తానే కిడ్నాప్ చేసి, ఏమీ తెలియనట్లుగా నటించే సన్నివేశాలు ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి. భర్తపై అనుమానం పెంచుకుని అతడిని కట్టేసి కొట్టే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివర్లో లావణ్య అరుంధతి స్టైల్ లో కనిపిస్తూ చెప్పే డైలాగ్ ట్రైలర్ ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆ సీన్.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
భార్య పాత్రలో ఆమె చూపించిన ఉగ్రరూపం, కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇక సినిమాలో సప్తగిరి, వీటీవీ గణేష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వారి కామెడీ ట్రాక్ సినిమాకు అదనపు బలం కానుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అలాగే మలయాళ నటుడు దేవ్ మోహన్ తన పాత్రలో సరదాగా, చాలా నేచరుల్ గా యాక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు మంచి ఎనర్జీ ఇచ్చింది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగమోహన్ ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత నటిస్తున్న మొదటి తెలుగు సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో ట్రైలర్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటోంది.
రామ్ చరణ్ కూడా ట్రైలర్ పై స్పందిస్తూ, "ఇది ఫ్రెష్ గా, సరదాగా, హార్ట్ తో తీసిన సినిమా లాగా కనిపిస్తోంది. మే 8న బ్లాక్ బస్టర్ కావాలి" అంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి సతీ లీలావతి ట్రైలర్ చూస్తే నవ్వులు, భావోద్వేగాలతో సినిమా తెరకెక్కిందని స్పష్టమవుతోంది. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు ఫన్నీగా చూపిస్తూ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక లీలావతి తన భర్తను ఎందుకు కిడ్నాప్ చేసింది? వారి మధ్య గొడవలకు అసలు కారణం ఏమిటి? అనేది తెలుసుకోవాలంటే మే 8 వరకు వేచి చూడాల్సిందే.