ఆర్టిస్టును చూసి జనం థియేటర్లకు రావడం లేదు: హాస్య‌న‌టుడు సప్తగిరి

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన `సతీ లీలావతి` చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక శనివారం ఘనంగా జరిగింది.;

Update: 2026-05-02 10:52 GMT

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన `సతీ లీలావతి` చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి సినిమా ఇండస్ట్రీలో మారుతున్న ధోరణులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో కేవలం ఆర్టిస్టులను చూసి జనం థియేటర్లకు రావడం లేదని, ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు దర్శకుడి ప్రతిభను బట్టి సినిమాకు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మౌత్ టాక్ బాగుంటేనే సినిమాలు ఆడుతున్నాయని, గొప్ప నటులు అయితే తప్ప జనం థియేటర్ల వరకు రావడానికి ఆలోచిస్తున్నారని సప్తగిరి పేర్కొన్నారు.

దర్శకుడు తాతినేని సత్యపై నమ్మకంతో ప్రేక్షకులు థియేటర్లకు రావచ్చని, ఆయన `సతీ లీలావతి`ని అద్భుతంగా రూపొందించారని సప్తగిరి కితాబిచ్చారు. చిత్రీకరణ సమయంలో లావణ్య త్రిపాఠి చూపిన అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆమె గర్భవతిగా ఉండి కూడా ఎంతో ఓపికతో, ధైర్యంతో షూటింగ్‌లో పాల్గొన్నారని.. ఆమె వృత్తి పట్ల చూపే గౌరవం అభినందనీయమని ప్రశంసించారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ వేడుకలో పాల్గొన్న నటుడు జీవన్ బొటిమల మాట్లాడుతూ.. లావణ్య త్రిపాఠి తనకు `లక్కీ హ్యాండ్` అని కొనియాడారు. ఆమెతో కలిసి నటించిన తర్వాతే తనకు ‘విశ్వంభర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ చిత్రాలలో అవకాశాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ, ‘భీమిలి కబడ్డీ జట్టు’ నుంచి దర్శకుడు సత్య తనకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. లావణ్య గారు తన ప్రెగ్నెన్సీ సమయంలోనూ పడ్డ శ్రమ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

చిత్ర యూనిట్ సభ్యులు బినేంద్ర మీనన్, అభినయ శ్రీనివాస్ మరియు రచయిత ఉదయ్ కూడా ఈ సినిమాపై తమకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డిఫరెంట్ లొకేషన్లలో ఎంతో సరదాగా షూటింగ్ జరిగిందని, కథలో ఉన్న ఫన్ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేయడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయని, మే 8న ప్రేక్షకులు ఈ వినోదాత్మక చిత్రాన్ని ఆదరిస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థలు అండగా నిలవడం, మెగా కుటుంబం నుంచి మద్దతు లభించడం ‘సతీ లీలావతి’కి కలిసొచ్చే అంశాలు. ఒకవైపు వైవిధ్యమైన కంటెంట్, మరోవైపు సీనియర్ దర్శకుడు తాతినేని సత్య మార్కు వినోదం ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. లావణ్య త్రిపాఠి కొణిదెల తన సహజసిద్ధమైన కామెడీతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోబోతుందో తెలియాలంటే మే 8 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News