సంక్రాంతి మూవీస్ స్టోరీ..అంతా అనిల్ ఫార్ములానే!
ఏ అంశం `సంక్రాంతికి వస్తున్నాం` మూవీని సంక్రాంతి రేస్‌లో విజేతగా నిలబెట్టిందో ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అవుతూ 2026 సంక్రాంతికి మూడు సినిమాలు పోటీపడుతున్నాయి.;
2025 సంక్రాంతి రేసులో చాలా కూల్‌గా దిగిన మూవీ `సంక్రాంతికి వస్తున్నాం`. వెంకీ మామతో కలిసి అనిల్ రావిపూడి తన మార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కామెడీని జోడించి చేసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి ఊహించిన విధంగా వసూళ్ల వర్షం కురిపించింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. అంతే కాకుండా సంక్రాంతి రేసులో ముందు వరుసలో నిలబడి సంక్రాంతి విజేతగా నిలిచింది.
ఇందులో హీరో..ఇల్లాలు, ప్రియురాలు మధ్య నలిగే వ్యక్తిగా కనిపించి ఫ్యామిలీస్ కావాల్సినంత వినోదాన్ని అందించాడు. ఇదే ఈ సినిమా విజయానికి ప్రధాన యుఎస్‌పీగా మారి పోటీలో ఎన్ని సినిమాలున్నా వాటన్నింటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి కాసులు వర్షం కురిపించింది. ఒక విధంగా చెప్పాలంటే `గేమ్ ఛేంజర్` వల్ల నష్టాల్లో కూరుకుపోతున్న దిల్ రాజు, శిరీష్‌లని కాపాడి మళ్లీ మార్కెట్‌లో నిలబడేలా చేసింది.
ఏ అంశం `సంక్రాంతికి వస్తున్నాం` మూవీని సంక్రాంతి రేస్‌లో విజేతగా నిలబెట్టిందో ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అవుతూ 2026 సంక్రాంతికి మూడు సినిమాలు పోటీపడుతున్నాయి. అవే మెగాస్టార్ -అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న `మన శంకర వరప్రసాద్ గారు`, రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, శర్వానంద్ `నారీ నారీ నడుమ మురారి`. ఇందులో ముందు వరుసలో నిలుస్తున్న మూవీ చిరు `మన శంకర వరప్రసాద్ గారు`. ఇందులో చిరుకు జోడీగా నయనతార నటించింది.
ఇందులో మాజీ భార్యగా నయన్ కనిపించనుండగా చిరుకు గాళ్ ఫ్రెండ్‌గా కేథరిన్ నటించింది. ఈ ఇద్దరి మధ్య నలుగుతూ ఆద్యంతం నవ్వులు పూయించే క్యారెక్టర్‌లో మెగాస్టార్ కనిపించబోతున్నారు. చిరు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసి చాలా కాలం అవుతోంది. ఇన్నేళ్ల విరామం తరువాత పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌తో చిరు వస్తుండటంతో ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అనిల్ 2025కి `సంక్రాంతికి వస్తున్నాం`తో బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోవడంతో చిరు సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.
ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి`ది కూడా ఇదే ఫార్ములా. తన మార్కు యాక్షన్ సినిమాలకు పూర్తి భిన్నంగా రవితేజ కొత్తగా ట్రై చేసిన సినిమా ఇది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భార్యగా డింపుల్ హయాతీ, ప్రియురాలిగా అషికా రంగనాథ్ నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఈ మూవీ జనవరి 13నే వస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు యంగ్ హీరో శర్వానంద్ మూవీ కూడా సంక్రాంతి బరిలో పోటీపడుతోంది.
గత కొంత కాలంగా హిట్ సినిమా కోసం శ్రమిస్తున్న శర్వానంద్ ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌నే నమ్ముకున్నాడు. తను నటించిన లేటెస్ట్ మూవీ `నారీ నారీ నడుమ మురారి`. రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. శర్వాకు జోడీగా సాక్షీ వైద్య, సంయుక్త మీనన్ నటించారు. సాక్షీ వైద్య గాళ్ ఫ్రెండ్‌గా, సంయుక్త మీనన్ ఎక్స్ గాళ్ ఫ్రెండ్‌గా నటించారు. వినోదమే ప్రదానంగా సాగే ఈ మూవీ ప్రేక్షకుల్ని సంక్రాంతి ఆకట్టుకోవడం ఖాయం అని ప్రచార చిత్రాలు చెబుతున్నాయి. ఒకే ఫార్ములాతో సంక్రాంతి బరిలో పోటీపడుతున్న ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో వేచి చూడాల్సిందే.