చివరి వీడియో: తేనెటీగ కుట్టి నిర్మాత దుర్మరణం
కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త, సినీనటుడు సంజయ్ కపూర్ షాకింగ్ మరణం ఇప్పటికీ కుటుంబాన్ని, అతడి స్నేహితులను వెంటాడుతోంది.;
కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త, సినీనటుడు సంజయ్ కపూర్ షాకింగ్ మరణం ఇప్పటికీ కుటుంబాన్ని, అతడి స్నేహితులను వెంటాడుతోంది. ఒకే ఒక్క తేనెటీగ వేల కోట్ల ఆస్తిపరుడి మరణానికి కారణమైంది. అతడు పోలో మ్యాచ్ ఆడుతుండగా తేనెటీగను మింగాడు. అది శ్వాసనాళంపై కుట్టడం అలెర్జీ కారణంగా అది మూసుకుపోయి ఊపిరాడక గుండెపోటుతో మృతి చెందాడనే కథనం రావడం ఆశ్చర్యపరిచింది. ఒక ప్రముఖుడికి ఇలాంటి దుర్మరణం ఊహించనిది.
కానీ విధి విచిత్రమైనిది. దీనిని ఎవరూ ఆపలేరు. సంజయ్ అకస్మాత్తుగా పోలో గ్రౌండ్స్ లో కుప్పకూలి మరణించాడు. అతడు గ్రౌండ్ లో పడి ఉన్న వీడియో, అతడికి వైద్య సిబ్బంది సీపీఆర్ చేస్తూ బతికించడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హృదయాలను కదిలిస్తోంది. ఇలాంటి వీడియోని షేర్ చేసిన వ్యక్తిపై విమర్శలు వెల్లువెత్తినా వాస్తవంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇది కళ్లకు కట్టింది.
సంజయ్ 10,000 కోట్ల ఆస్తిపరుడు. 53 సంవత్సరాల వయసులో మరణించాడు. ఆయన మరణించిన కొన్ని రోజుల తర్వాత, అతడి చివరి క్షణాల వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. విండ్సర్‌లోని గార్డ్స్ పోలో క్లబ్‌లో జరిగిన క్వీన్స్ కప్ సెమీఫైనల్‌లో సంజయ్ ఆడుతున్నట్లు సమాచారం. సంజయ్ గుండెపోటుకు గురైన తర్వాత, ఆయనను బతికించడానికి ప్రయత్నిస్తున్న వైద్య రెస్క్యూ బృందం ఆయనను చుట్టుముట్టింది. వైద్య సిబ్బందిలో ఒకరు తన ఛాతీని నొక్కుతూ బతికించేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ప్రయత్నం సఫలం కాలేదు. అతడు అప్పటికే మరణించాడు. ఈ వీడియోపై నెటిజనులు రకరకాల వ్యాఖ్యలతో స్పందించారు.
సంజయ్ కపూర్ ఆటో విడిపరికరాల సంస్థ సోనాకామ్ అధినేత. పలు దేశాల్లో కంపెనీని విస్తరించాడు. అతడికి ముగ్గురు భార్యలు కాగా మొదటి భార్య, నటి కరిష్మా కపూర్ కు ఇద్దరు వారసులు, మూడో భార్య ప్రియా సచ్ దేవ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అతడి పది వేల కోట్ల ఆస్తి పంపకాలు ఎలా సాగుతాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సంజయ్ కంపెనీల బాధ్యతను అతడి సోదరీమణులు నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది. హిందూ ఆస్తి చట్టం ప్రకారం.. పిల్లలందరికీ తండ్రి ఆస్తిపై హక్కు ఉంటుంది. కానీ వీలునామా రాస్తే అందులో ఉన్న నియమాల ప్రకారం ఆస్తులను పంపిణీ చేయాల్సి ఉంటుంది.