సంజయ్ కపూర్ 30 వేల కోట్ల ఆస్తి వివాదంలో కొత్త ట్విస్టు
తేనెటీగను మింగాక ఊపిరాడని కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ లండన్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే.;
తేనెటీగను మింగాక ఊపిరాడని కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ లండన్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం రూ.30,000 కోట్ల విలువైన ఆస్తిపై వారసత్వ పోరు ఒక సినిమాని మించి రసవత్తరంగా మారింది. ప్రస్తుతం చట్టపరమైన వివాదాలు అపరిష్కృతంగా ఉన్నాయి. సంజయ్ మొదటి భార్య పిల్లలు సమైరా, కియాన్ కపూర్ .. మూడో భార్య ప్రియా కపూర్ కి తమ తండ్రి సంజయ్ కపూర్ ఆస్తులన్నిటినీ దఖలు పరచలేదని, తమకు చెందాల్సిన ఆస్తిని అప్పగించాలని దావా వేసారు. ఇక ఇదే కేసులో సంజయ్ కపూర్ తల్లి రాణీ కపూర్ కూడా కొడుకు మూడో భార్య ప్రియా కపూర్ కి వ్యతిరేకంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆస్తి వివాదంలో తనకు దక్కాల్సినది ఇవ్వకుండా తనను నడి రోడ్డు పైకి విసిరేసారని రాణీ కపూర్ వాదించారు.
ప్రస్తుతం ఈ ఆస్తి వివాదం చిక్కుముడులు వీడటం లేదు. సంజయ్ కపూర్ జీవించి ఉండగానే ఒక వీలునామా రాసి ఇచ్చారని అది పూర్తిగా తమకు ఆస్తులను దఖలు పరచడమేనని ప్రియా కపూర్ కోర్టులో వాదిస్తున్నారు. అయితే ఈ వీలునామా చుట్టూ చాలా అనుమానాలను, సందేహాలను రైజ్ చేస్తూ కరిష్మా కపూర్ తరపు న్యాయవాది జెఠ్మలానీ బలంగా వాదిస్తున్నారు. చట్టంలో లొసుగులపై ప్రస్తుతం కోర్టులో చాలా విస్త్రతమైన చర్చ సాగుతోంది.
ముఖ్యంగా సంజయ్ కపూర్ కి చెందిన దేశ విదేశాలలోని ఆస్తులను సోలోగా ప్రియా కపూర్ అనుభవించడానికి లేదా ఆక్రమించడానికి, అమ్ముకోవడానికి లేకుండా నివారించాలని, దీనిపై విచారణ ముగిసేవారకూ ఎలాంటి హక్కులు తనకు లేకుండా చేయాలని కరిష్మా లాయర్ వాదిస్తున్నారు.
ఇప్పుడు ఈ ఆస్తి వివాదంలో అత్యంత కీలకమైన ప్రొబేట్.. కార్యనిర్వాహకుల వ్యవహారం కొత్తగా తెరపైకి వచ్చింది. 30 వేల కోట్ల ఆస్తి వారసత్వ వివాదంలో చట్టపరమైన సంక్లిష్టతలను న్యాయవాదులు జడ్జి ముందు తెరపైకి తెస్తున్నారు. సంజయ్ మరణించాక ప్రొబేట్ ని నియమించకపోవడంలో లొసుగును, కార్యనిర్వాహకుడి సమ్మతి లేకుండా ప్రియా కపూర్ ముందుకు సాగడం వంటి కారణాల వల్ల ఆమె కోర్టుకు సమర్పించిన వీలునామా చెల్లుబాటును సీనియర్ న్యాయవాదులు ప్రశ్నించారు.
ప్రొబేట్ -కార్యనిర్వాహకుడి ప్రమేయం లేకుండా సంజయ్ కపూర్ వీలునామా ఎలా రాస్తారు? అనేదానిని ఢిల్లీ హైకోర్టు పరిశీలించింది. ఈ వీలునామా విధానపరమైన లోపాలకు మించి నిర్మాణాత్మక, చట్టపరమైన బలహీనతలతో కునారిల్లిందని.. కార్యనిర్వాహకురాలు శ్రద్ధా సూరి మార్వా ప్రవర్తన వివాదాస్పదంగా ఉందని కరిష్మా న్యాయవాది జెఠ్మలానీ వాదించారు. వీలునామా నిబంధనల ప్రకారం, కపూర్ మరణం తర్వాత ఎస్టేట్ ఆస్తులను వెంటనే కస్టడీలోకి తీసుకుని, ప్రొబేట్ చర్యలను ప్రారంభించాల్సి ఉండగా అలా జరగలేదు. కార్యనిర్వాహక అధికారి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మహేష్ జెఠ్మలానీ వాదించారు. ప్రొబేట్ ని కోరలేదు.. ఆస్తులను కార్యనిర్వాహకుడు తన నియంత్రణలోకి తీసుకోలేదు! అనే బలమైన పాయింట్ ని రైజ్ చేసారు జెఠ్మలానీ. ప్రియాకపూర్ కు కార్యనిర్వాహకులు లేఖ రాసినా కానీ ప్రొబేట్ విషయంలో గందరగోళం నెలకొందని వాదిస్తున్నారు.
వీలునామా సాక్షి దినేష్ అగర్వాల్ ప్రకటనకు.. కార్యనిర్వాహకులు సూరి ప్రకటనకు మధ్య పొంతనలు కుదరలేదని కూడా జెఠ్మలానీ వాదిస్తున్నారు. చట్ట ప్రకారం ఎలాంటి సంప్రదింపులు లేని ఇలాంటి వీలునామా చెల్లుబాటు కాదని వాదించారు. ఒక వీలునామా ప్రొబేట్ కస్టోడియల్ బదిలీని తప్పనిసరి చేస్తే ..కార్యనిర్వాహకుడు రెండింటినీ విస్మరిస్తే, వీలునామా పేర్కొన్న విధంగా ఉందా? అని ప్రశ్నించే హక్కు కోర్టుకు ఉంది. వీలునామా విశ్వసనీయతను కోల్పోతుందని కూడా న్యాయవాదులు విశ్లేషించారు.
వీలునామా చెల్లుబాటు తేలే వరకు సంజయ్ కపూర్ విదేశీ ఆస్తులను రక్షించడానికి స్వతంత్ర నిర్వాహకుడిని నియమించాలని పిల్లల తరపు న్యాయవాది జెఠ్మలానీ కోర్టును ఒత్తిడి చేశారు. కోర్టు పర్యవేక్షణ లేకుండా, విదేశీ ఆస్తులను విక్రయించవచ్చు..దానివల్ల గొడవ ముదరవచ్చునని జెఠ్మలానీ హెచ్చరించారు.
స్వదేశీ ఆస్తుల తరహాలో కాకుండా విదేశీ ఆస్తులను తక్కువ సమయంలోనే అమ్మకాలు సాగించవచ్చు.. లేదా ఇతరులకు బదిలీ చేయొచ్చని కూడా న్యాయవాది వ్యాఖ్యానించారు. దీనిని నివారించేందుకు అడ్మినిస్ట్రేటర్ లేదా రిసీవర్ ని నియమించాలని కూడా వాదించారు.
సంజయ్ కపూర్ కు న్యూయార్క్, యూకేలోని సొంత ఇల్లు, ఆస్తులు, అలాగే ఆరియస్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌కు అనుసంధానించబడిన విదేశీ సంబంధిత పెట్టుబడులు ఉన్నాయి. అయితే వీటిపై హక్కులు ఎవరికి ఉన్నాయి? అంటే.. ఈ ఆస్తులకు యాజమానులు ఎవరో విల్లు నిర్ణయించాల్సి ఉంది. కానీ అది సరిగా లేదు! అంటూ లాయర్ వాదించారు. విదేశీ ఆస్తుల వ్యవహారంలో విల్లు సరిగా లేనప్పుడు, ఒకే లబ్ధిదారును నమ్మి వాటిని అలా వదిలేస్తే అది ప్రమాదకరంగా మారుతుందని కూడా జెఠ్మలానీ వాదించారు.
``నియంత్రణ లేకుండా ఆస్తులను వదిలేయడం తెలివి తక్కువ నిర్ణయం. కోర్టు తుది అభిప్రాయానికి వచ్చే వరకు ఎస్టేట్‌ను రక్షించాల్సి ఉంద``ని ఆయన అన్నారు. వీలునామా ఆధారంగా లావాదేవీలు విదేశాలలో జరిగిన తర్వాత, వాటిని తిప్పికొట్టడం కష్టం లేదా అసాధ్యం కావచ్చు. తరువాత భారతీయ కోర్టు ఆ పత్రాన్ని తిరస్కరించినా ప్రయోజనం ఉండదని లాయర్ వాదించారు. ప్రస్తుతానికి సంజయ్ కపూర్ రాసిన వీలునామా ఇంకా వివాదాలను పరిష్కరించలేని స్థితిలో ఉంది.